వీడెవడండి బాబూ : ఓటు వేశాక శబ్దం రాలేదని ఈవీఎం పగలగొట్టాడు

బీహార్ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల్లో విచిత్రం చోటు చేసుకుంది. ఓటు వేశాక బీప్ శబ్దం రాలేదని ఓ ఓటర్ కి తిక్కరేగింది. కోపంతో ఊగిపోయిన అతడు ఈవీఎంపై ప్రతాపం చూపించాడు. ఈవీఎంను నేలకేసి కొట్టాడు. దీంతో ఈవీఎం ముక్కలైంది. చాప్రాలోని 133వ నెంబర్ పోలింగ్ బూత్ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. ఈవీఎం ధ్వంసం చేసిన వ్యక్తిని రంజిత్ పాశ్వాన్ గా గుర్తించారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఓటరు తీరుతో పోలింగ్ బూత్ లో ఉన్న సిబ్బంది షాక్ తిన్నారు. అసలేం జరుగుతుందో తెలుసుకునేలోపే ఆ వ్యక్తి ఈవీఎంని పగలగొట్టాడు.
సోమవారం (మే 6,2019) దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల 5వ దశ పోలింగ్ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ సహా దేశంలోని ఏడు రాష్ట్రాల్లోని 51 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. 51 నియోజకవర్గాల నుంచి 674 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 12శాతం మంది మహిళలే. ఈ 51 నియోజకవర్గాల్లో 9 కోట్ల మంది ఓటర్లున్నారు.
రాష్ట్రాల వారీగా చూస్తే యూపీలో 14, రాజస్తాన్‌లో 12, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో చెరో 7, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 4 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 96వేల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. 5వ దశతో దేశంలో 424 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ముగుస్తుంది. మిగిలిన 118 స్థానాలకు 6వ (మే 12), 7వ (మే 19) దశల్లో పోలింగ్ జరుగుతుంది. మే 23వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు.