Sanju Samson : సంజూ శాంసన్ స్థానాన్ని భర్తీ చేయగలరా? రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ హాట్ కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్‌లో సంజూ శాంసన్ (Sanju Samson)స్థానాన్ని భర్తీ చేయడం అసాధ్యం అని ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ తెలిపాడు.
There is No Replacement For Sanju Samson RR Captain Riyan Parag
- ట్రేడింగ్‌లో చెన్నైకి వెళ్లిన సంజూ శాంసన్
- ఆర్ఆర్లోని జడేజా, కర్రాన్
- రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ కీలక వ్యాఖ్యలు
Sanju Samson : రాజస్థాన్ రాయల్స్‌లో సంజూ శాంసన్ స్థానాన్ని భర్తీ చేయడం అసాధ్యం అని ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ తెలిపాడు. భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాల స్థానాన్ని భర్తీ చేయడం ఎంత అసాధ్యమో, ఆర్ఆర్లో సంజూ స్థానాన్ని భర్తీ చేయడం అంతేనని అన్నాడు.
2021 నుంచి 2025 వరకు రాజస్థాన్ రాయల్స్‌కు సంజూ శాంసన్ సారథిగా వ్యవహరించాడు. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు అతడు ట్రేడింగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు వెళ్లిపోయాడు. అతడి స్థానంలో సీఎస్కే నుంచి రవీంద్ర జడేజా, సామ్ కర్రాన్‌లు ఆర్ఆర్ జట్టులోకి వచ్చారు. సంజూ శాంసన్ వెళ్లిపోవడంతో ఐపీఎల్ 2026 సీజన్‌కు రియాన్ పరాగ్ నాయకత్వ బాధ్యతలను నిర్వర్తించనున్నట్లు ఆర్ఆర్ తెలియజేసింది.
Ishan Kishan : టీ20ల్లో ఇషాన్ కిషన్ కెప్టెన్సీ రికార్డు ఇదే.. ఓరీ నాయనో..
సంజూ శాంసన్ లోటును భర్తీ చేయడంపై విలేకరుల సమావేశంలో రియాన్ పరాగ్ స్పందించాడు. దాని గురించి తామెప్పుడు ఆలోచించలేదన్నాడు. అతడి స్థానంలో ఎవరైనా బ్యాటింగ్ చేయొచ్చు, లేదా వికెట్ కీపింగ్ చేయొచ్చు కానీ అతడి లాంటి నైపుణ్యం ఉన్న ఆటగాడిని తీసుకురావడం కష్టం. ఎలాగైతే భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు ప్రత్యామ్నాయం లేనట్లుగానే ఆర్ఆర్లో కూడా సంజూ లేని లోటును భర్తీ చేయడం కష్టం. అని పరాగ్ అన్నాడు.
సంజూ శాంసన్ 11 ఏళ్ల పాటు రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడాడు. ఆ జట్టు అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా, అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ నిలిచాడు. అతడి స్థానంలో ఆర్ఆర్ జట్టు ఐపీఎల్ 2022 ఫైనల్ కు చేరుకోగా, 2024లో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది.
ఐపీఎల్ 2025లో ఆర్ఆర్ పేలవ ప్రదర్శన చేసింది. 10 మ్యాచ్‌ల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. దీనిపై పరాగ్ మాట్లాడుతూ.. ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శన చేస్తామన్నాడు. గత సీజన్లో ఐదు లేదా ఆరు మ్యాచ్‌ల్లో తాము చివరి ఓవర్లో లేదా చివరి బంతికే ఓడిపోయామన్నాడు. వాటిల్లో గెలిచి ఉంటే నాకౌట్ కు అర్హత సాధించి ఉండేవాళ్లమని చెప్పుకొచ్చాడు. గతంలో చేసిన తప్పుల నుంచి నేర్చుకున్నామని, ఈ సారి మెరుగైన వ్యూహాలతో బరిలోకి దిగనున్నట్లు వెల్లడించాడు.
ఇక తనకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించడంపై స్పందిస్తూ.. 17 ఏళ్ల వయసులో రాజస్థాన్ జట్టులోకి వచ్చానని అన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నట్లు తెలిపాడు. విజయాల కంటే వైఫల్యాలనే ఎక్కువగా చూశానన్నాడు. అయినప్పటికి కూడా తనను అర్థం చేసుకోవడంతో పాటు మద్దతు ఇచ్చిన ఆర్ఆర్ మేనేజ్మెంట్కు ధన్యవాదాలు తెలియజేశాడు.
