Lok Sabha Elections 2024: ఇంత మెజార్టీ సాధిస్తామని బీజేపీ నిజంగా నమ్ముతోందా? లేదంటే..

పలు పరిస్థితులు అంతిమంగా బీజేపీని మూడోసారి అధికారపీఠానికి దగ్గర చేస్తున్నాయి.

BJP Election Strategy

లోక్‌సభ ఎన్నికల్లో 370 సీట్లలో విజయఢంకా మోగించాలనే లక్ష్యాన్ని నిజంగా సాధించగలమని బీజేపీ నమ్ముతోందా..? లేక కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి ఆ సంఖ్యను టార్గెట్‌గా పెట్టుకుందా….? కమలదళం భావిస్తున్నట్టుగా అయోధ్య రామమందిరం ఇంకోసారి అధికారాన్ని కట్టబెడుతుందా..? 2014, 2019లోలా 2024 సాధారణ ఎన్నికల్లో కూడా మోదీ మ్యాజిక్ పనిచేస్తుందా..? 2014తో పోలిస్తే 2019లో ఎక్కువస్థానాలను గెలుచుకున్న బీజేపీ..గత ఎన్నికల కన్నా ఎక్కువగా సీట్లు గెలుచుకునే పరిస్థితులు ఇప్పుడున్నాయా..?

ఏకపార్టీ వ్యవస్థకు కాలం చెల్లిపోయి..సంకీర్ణ రాజకీయాలు రాజ్యమేలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏ కూటమయినా..ఎంత ప్రజాదరణ ఉన్నా…ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకుని మూడోసారి గెలవడం సాధ్యమేనా..? మరీ కోరుకున్నట్టుగా 400 స్థానాలు కాకపోయినప్పటికీ…2019లో గెలుచుకున్నన్ని లేదా..అంతకు కొన్ని ఎక్కువస్థానాలతో బీజేపీ నేతృత్వంలో NDA అధికారంలోకి రావడం ఖాయమని ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంటున్నారు. నిజానికి ఆయనే కాదు…దేశం మొత్తం ఇదే అభిప్రాయంతో ఉంది.

సీట్లు, ఓట్లలో తేడా తప్పిస్తే..
సీట్లు, ఓట్లలో తేడా తప్పిస్తే…ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమైపోయిందన్న ఓ రాజకీయ వాతావరణం దేశమంతా ఉంది. బీజేపీ వరుస గెలుపులకు ప్రశాంత్ కిశోర్ కొన్ని కారణాలు చెబుతున్నారు. మోదీ ఆకర్షణీయ శక్తి, రామమందిరంతో పాటు ప్రతిపక్షాలు ఐక్యంగా లేకపోవడం కమలం పార్టీ గెలుపును నిర్దేశిస్తున్నాయన్నది వ్యూహకర్త విశ్లేషణ.

ఇండియా కూటమి అనుకున్న స్థాయిలో ప్రభావవంతంగా పనిచేయడం లేదని, అసలు కూటమి ఏర్పాటు కావడం, పొత్తులు వంటివన్నీ జరగాల్సినవాటికన్నా చాలా ఆలస్యంగా జరిగాయని…కూటమి ఇప్పుడు చేస్తున్న పనులన్నీ గత ఏడాది చేసుండాల్సిందని, ఇండియా కూటమి వ్యవహారశైలి 2024 ఎన్నికలకు కాకుండా..రానున్న ఏళ్లల్లో జరిగే ఎన్నికలకు సన్నద్ధమవుతున్నట్టుగా ఉందని తీవ్రస్థాయిలో విమర్శలు సైతం ప్రశాంత్ కిషోర్ గుప్పించారు.

వాటిని తిప్పికొట్టకుండా ఇండియా కూటమి..
పార్టీగా 370, కూటమిగా 400 స్థానాల గురించి పదే పదే మోదీ చెబుతోంతే…..ఇండియా కూటమి నేతల వాటిని తిప్పికొట్టకుండా.. ఎన్నికల్లో ఎలాగూ గెలిచేది బీజేపీ అన్న తరహాలో మాట్లాడుతున్నారని, ప్రవర్తిస్తున్నారని, అసలు పోటీకి ముందే కూటమి నేతలు చేతులెత్తేశారని ప్రశాంత్ కిశోర్ తూర్పారపట్టారు. అసలు దేశంలో ఎక్కువ మంది ప్రజలు మోదీపై సానుకూల అభిప్రాయంతో లేరని…అయినా సరే..ప్రతిపక్షం తరపున బలమైన నేత లేకపోవడం, పార్టీలు ఐకమత్యంతో లేకపోవడం వంటి అంశాలు కమలం పార్టీ గెలుపును నల్లేరుమీద నడకలా మార్చివేశాయన్నది కూడా ప్రశాంత్ కిశోర్ అభిప్రాయం.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయే పరిస్థితి లేకపోతే…పరిణామాలు మరోలా ఉంటాయని కూడా ప్రశాంత్ కిశోర్ విశ్లేషణ. దీనికి 2019 ఎన్నికల ఫలితాలను కూడా ఉదాహరణగా చూపుతున్నారు. 2019లో ప్రతి వందమందిలో 38 మంది మాత్రమే మోదీకి ఓటు వేశారని, 62 మంది ఓటేయలేదని, అయితే ఆ 62 మంది ఐక్యతగా లేకపోవడం…బీజేపీకి లాభించిందని చెబుతున్నారు.

ప్రశాంత్ కిశోర్ విశ్లేషణ సంగతి పక్కనపెడితే…దేశంలో బీజేపీ అత్యంత శక్తిమంతమైన పార్టీ, ప్రధాని మోదీ ప్రజాదరణ ఉన్న నేత అనడంలో సందేహం లేదు. 2009తో పోలిస్తే…2014, ఆ తర్వాత 2019, అప్పటినుంచి ఇప్పటిదాకా బీజేపీకి, మోదీకి ఆదరణ భారీగా పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. 2014 నుంచి 2019తో పోలిస్తే…2019 నుంచి 2024 మధ్య మోదీ పాపులారిటీ, బీజేపీ అంటే సానుకూలత మరింత పెరిగాయని రాజకీయ నిపుణులు అంటున్నారు. దీనికి అనేక కారణాలున్నాయి.

భారత్‌కు ప్రత్యేక గుర్తింపు
మోదీ హయాంలో విదేశాంగవిధానంలో భారత్ అత్యంత బలమైన దేశంగా మారింది. భారతీయులే కాదు…దాయాది దేశం పాకిస్థాన్ సైతం ఈ విషయాన్ని అంగీకరించింది. భారత స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎన్నోసార్లు బహిరంగంగానే ప్రశంసించారు. అనుంగు మిత్రదేశం రష్యాతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ ఇలా అన్నిదేశాల్లోనూ భారత్‌కు ఓ ప్రత్యేకగుర్తింపు, బలం పెరిగేలా చేయడంలో మోదీ వందశాతం సఫలీకృతులయ్యారు. గతంలో ఇష్టారాజ్యంగా భారత్‌పై అవాకులు, చెవాకులూ పేలే అమెరికా వంటి దేశాలు..వాళ్లకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా..మన విధానాలను విమర్శించలేనిస్థాయిలో ఇప్పుడుండడానికి కారణం మోదీనే అన్నది అంగీకరించి తీరాల్సిన నిజం.

ఇక ప్రధానికి సానుకూలంగా ఉన్న మరో అంశం..కరోనా పరిస్థితులను తట్టుకుని సైతం భారత్ బలమైన ఆర్థిక శక్తిగా అవతరించడం. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లో కన్నా నిరుద్యోగం భారత్‌లో రెండింతలు ఉందని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నప్పటికీ….కరోనా అనంతర పరిస్థితుల్లో కుప్పకూలిన మన పొరుగుదేశాలు శ్రీలంక, పాకిస్థాన్‌…మనం ఎలాంటి సురక్షిత స్థానంలో ఉన్నామో చెప్పకనే చెబుతున్నాయి.

అభివృద్ధిచెందిన ఆర్థిక వ్యవస్థలే ఆర్థికమాంద్యం లాంటి పరిస్థితులతో అల్లాడుతుంటే భారత్ ఉన్నంతలో మెరుగ్గానే ఉంది. ఇది మోదీపై ప్రజల్లో తిరుగులేని సానుకూలతను పెంచింది. ఇక నిత్యం క్రియాశీలకంగా ఉండే ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలు….తరచుగా తనిఖీలు నిర్వహిస్తూ…అవినీతిని మోదీ సర్కార్ సహించడం లేదన్న సందేశాన్ని ప్రజల్లోకి పంపిస్తున్నాయి. దీంతో 2014లో అప్పటి యూపీయే ప్రభుత్వం మీదున్న అవినీతి ఆరోపణలు ప్రస్తుత ప్రభుత్వంమీద ఏమాత్రం రావడం లేదు.

వీటితో పాటు ప్రధాని అభ్యర్థిగా మోదీ ఉండడంలోనే బీజేపీ సగం గెలుపుదాగి ఉందన్నది రాజకీయ నిపుణుల విశ్లేషణ. 2014లో, 2019లో, 2024లో ప్రధాని అభ్యర్థెవరో స్పష్టంగా చెప్పి ఎన్నికలకు వెళ్తోంది బీజేపీ. అదే సమయంలో బీజేపీ ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ ఏ ఒక్క ఎన్నికల్లోనూ ప్రధాని రేసులో ఎవరున్నారో చెప్పలేకపోతోంది. 2014 సంగతి పక్కనపెడితే…2019లోనూ, ఇప్పుడు ప్రతిపక్షాలు గెలిస్తే..ప్రధానిగా అయ్యేదెవరో ప్రజలకు తెలిస్తే…ఓటర్ల ఆలోచనల్లో స్పష్టమైన మార్పు వచ్చి ఉండేది.

సంప్రదాయ ఓటర్ల అభిప్రాయం మారనప్పటికీ..గెలుపోటములను నిర్దేశించే తటస్థ ఓటర్లకు ఎవరికి ఓటేయాలనేదానిపై స్పష్టమైన అభిప్రాయం కలిగేది. గెలిచే పరిస్థితి లేకపోయినా బలమైన ప్రతిపక్షంగా మారే అవకాశం అయినా లభించేందుకు వీలు కలిగేది. కానీ 2019లోనే కాదు..ఇప్పుడు కూడా ఇండియా కూటమి గెలిస్తే..ఎవరు ప్రధాని అన్నది ప్రజలకే కాదు..ఆ కూటమిలోని పార్టీలకే స్పష్టత లేదు.

కాంగ్రెస్ తరపున ప్రధాని అభ్యర్థి ఉంటారా లేక కూటమిలోని మిగిలిన పక్షాల నుంచి ప్రధానిని ఎంపికచేస్తారా అన్నది కూడా తెలియడం లేదు. బీజేపీ తరపునా, కూటమి తరపునా మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి అధికారపక్షం ఎన్నికల్లో దూసుకుపోతోంటే…అసలు ప్రధాని అభ్యర్థిగా ఎవరిని ఎంచుకోవాలో తెలియని అస్పష్టతతో కాంగ్రెస్, ఇండియా కూటమి వెనకపడిపోతున్నాయి. ఈ పరిస్థితులు అంతిమంగా బీజేపీని మూడోసారి అధికారపీఠానికి దగ్గర చేస్తున్నాయి.

Lalu vs BJP: ఒక్క సభతో అటెన్షన్ గ్రాబ్ చేసిన ఇండియా కూటమి

ట్రెండింగ్ వార్తలు