మహా రాజకీయం : ఢిల్లీలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం

  • Published By: chvmurthy ,Published On : November 10, 2019 / 07:05 AM IST
మహా రాజకీయం : ఢిల్లీలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం

Updated On : November 10, 2019 / 7:05 AM IST

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు నవంబర్ 10వ తేదీ, ఆదివారం, సాయంత్రం ఢిల్లీలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం అవుతోంది. మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్‌ భగత్‌సింగ్‌ కొశ్యారీ ఆహ్వానించారు. అందుకు సోమవారం, నవంబర్ 11 డెడ్‌లైన్‌ విధించారు. ఆదివారం జరిగే కోర్ కమిటీ సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటు, బల నిరూపణకు అనుసరించాల్సిన వ్యూహలపై చర్చించనున్నారు.

ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 105 సీట్లు గెలిచి, అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ… ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్‌ ఫిగర్‌ను మాత్రం బీజేపీ సాధించలేకపోయింది. ఎన్నికలకు ముందు శివసేన( 50+)తో కలిసిపోటీచేసిన బీజేపీ.. స్పష్టమైన ఆధిక్యాన్ని సంపాదించింది. ఫలితాల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే సీఎం పదవీకాలాన్ని చెరో సగం(50-50) పంచుకుందామనే డిమాండ్ ను శివసేన…బీజేపీ ముందుంచింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటులో అనిశ్చితి ఏర్పడింది. 

శివసేన.. ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నా.. ఎన్సీపీ, కాంగ్రెస్‌లు అందుకు సిధ్ధంగా లేవు. తాము బాధ్యతాయుత ప్రతిపక్షంలోనే కూర్చుంటామని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ స్పష్టం చేశారు. దీంతో, ఆయా పార్టీల నేతలు పలుమార్లు గవర్నర్‌ను కలిసి తమ తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. బీజేపీతో జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే  సీఎం కుర్చీ 50-50 పై శివసేన ఇప్పటికీ పట్టు పడుతోంది. ఇప్పుడు గవర్నర్ నుంచి బీజేపీ కి పిలుపు రావటంతో తదుపరి వ్యూహరచనపై అధిష్టానంతో చర్చించేందుకు మహా బీజేపీ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు.