గోహత్యలు జరుగుతున్నాయ్.. అందుకే వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి అంతమంది మృతి: బీజేపీ సీనియర్ నేత
ఇకనైనా స్వస్తి చెప్పకపోతే ఇలాంటి విషాద ఘటనలు ఇంకా కొనసాగుతాయని..
Gyandev Ahuja : కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి 360 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అందరి హృదయాలను కలచివేస్తున్న ఈ ఘటనపై రాజస్థాన్ బీజేపీ సీనియర్ నేత స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
కొండచరియలు విరిగిపడి అంతమంది చనిపోయిన ఘటనకు గోహత్యలే కారణమని ఆయన అన్నారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన గోహత్యకు పాపానికి సంబంధించిన ప్రత్యక్ష పరిణామంగా ఆయన అభివర్ణించారు. ఒకవేళ కేరళలో ఈ పద్ధతికి ఇకనైనా స్వస్తి చెప్పకపోతే ఇలాంటి విషాద ఘటనలు ఇంకా కొనసాగుతాయని హెచ్చరించారు.
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లోనూ అప్పుడప్పుడు మేఘాలు, కొండచరియలు విరిగిపడుతుంటాయని, అటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నప్పటికీ వయనాడ్ దుర్ఘటన స్థాయిలో ఏమీ మరణాలు సంభవించడం లేదని అహుజా చెప్పారు. 2018 నుంచి గోహత్యలు జరిగిన ప్రాంతాలు వయనాడ్ ఇటువంటి విషాద సంఘటనలను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. గోహత్యలను అరికట్టకపోతే కేరళలో ఇలాంటి విషాదాలు కొనసాగుతాయని చెప్పారు. అహుజా చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వస్తున్నాయి.
Also Read: దాని కోసమే అసెంబ్లీ సమావేశాలను కాంగ్రెస్ వాడుకుంది: మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి