కేరళలో కింగ్ మేకర్ బీజేపీనే -మెట్రో మ్యాన్

కేరళలో కింగ్ మేకర్ బీజేపీనే -మెట్రో మ్యాన్

Bjp May Emerge Kingmaker In Kerala Metroman

Updated On : March 25, 2021 / 7:59 AM IST

ఐదు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకునేందుకు కేంద్రంలో అధికార బీజేపీ తీవ్రంగా పనిచేస్తుంది.. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో ఎన్నికల్లో పొత్తులో పార్టీల సాయంతో సత్తా చాటగలమని భావిస్తోంది. ఈ క్రమంలోనే కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 6న జరగనుండగా.. నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది.

ప్రధాన పార్టీల నేతలు ప్రచారం హోరెత్తిస్తున్నారు. కేరళలో 1970 నుంచి కమ్యూనిస్టులే పరిపాలిస్తుండగా.. కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని గద్దె దింపాలని బీజేపీ గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మెట్రో మ్యాన్ శ్రీధరన్‌ను బీజేపీలోకి రాగా.. 88 ఏళ్ల వయసులో బీజేపీలో చేరిన నాటి నుంచి సభలు సమావేశాలకు హాజరవుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

యువతకు ఏ విధంగా ఉపాధి కల్పిస్తుంది అనే విషయాలపై మాట్లాడుతూ కేరళలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు. కేరళలో కింగ్ మేకర్‌గా బీజేపీ అవతరించబోతుందని జోస్యం చెప్పారు. ప్రజలు కమ్యూనిస్టులను నమ్మే స్థితిలో లేరన్నారు. దేవభూమి కేరళలో సంప్రదాయాలను కమ్యూనిస్టులు కాలరాస్తున్నారని మండిపడ్డారు.

పెద్దల కాళ్ళు మొక్కడం దేశంలో ఒక సంప్రదాయంగా వస్తుందని, కానీ కమ్యూనిస్టులు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. దేశ సంస్కృతీ సంప్రదాయాలను కించపరిచే వారిని ప్రజలు ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మరోవైపు సీఎం పినరయి విజయన్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోగా.. తిరిగి అధికారం తామే చేపడతామని ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు కమ్యునిస్టులు కూడా గతంలో ఎప్పుడూ లేనంతగా.. ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. కార్యకర్తలు గ్రౌండ్‌లోకి వెళ్లి ప్రతి వ్యక్తిని కలవాలని అంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్. పార్టీకి చెందిన విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాల నేతలను కూడా ప్రచారంలోకి దింపింది కమ్యునిస్ట్ పార్టీ. చిన్న చిన్న సభలు సమావేశాల్లో కూడా మంత్రులు పాల్గొంటూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. కాంగ్రెస్ కూడా యూనైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పేరుతో కుటమితో జతకట్టి ఎన్నికల్లో పోటీ చేస్తుండగా.. ఆ పార్టీ కూడా విజయంపై ధీమాగా ఉంది.