Rekha Gupta: ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. ఎవరు ఆమె? అంతటి స్థాయికి ఎలా వచ్చారంటే?
ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

Rekha Gupta
ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా పేరు ఖరారైంది. ఈ మేరకు బీజేపీ అధికారికంగా ప్రకటన చేసింది. గురువారం రామ్‌లీలా మైదానంలో ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమెతో పాటు పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
బీజేపీ ఎంపీ రామ్‌విర్ సింగ్ బిధూరి మాట్లాడుతూ.. తమ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ రేఖా గుప్తాను తమ నాయకురాలిగా ఎన్నుకుందని అన్నారు. ఆమె రేపు సీఎంగా ప్రమాణం చేస్తారని చెప్పారు.
రేఖా గుప్తా ఎవరు?
ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రేఖా గుప్తా షాలిమార్ బాగ్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆమె ఢిల్లీ బీజేపీ జనరల్ సెక్రటరీగానూ ఉన్నారు. ఆమె లా (ఎల్‌ఎల్‌బీ) గ్రాడ్యుయేట్.
కాలేజీలో చదువుతున్న రోజుల నుంచి ఆమె రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఒకవేళ ఢిల్లీకి మహిళను సీఎంగా చేయాలని బీజేపీ భావిస్తే ఆమె పేరు వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయని చాలా మంది ముంఉదగానే ఊహించారు.
రేఖ గుప్తా 1974లో హరియాణాలోని జింద్ జిల్లాలోని జులానా తెహసిల్‌లోని నంద్‌గర్ అనే గ్రామంలో జన్మించారు. అయితే, 1976లో ఆమె తండ్రికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ ఉద్యోగం వచ్చింది. దీంతో వారి కుటుంబం మొత్తం ఢిల్లీకి మకాం మార్చారు. రేఖా గుప్తా ఢిల్లీలో చదువు పూర్తి చేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడే రాజకీయాల్లోకి ప్రవేశించి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో చేరారు.
అనంతరం రాజకీయాల్లోకి వచ్చి బీజేపీలో అనేక ముఖ్యమైన పదవుల్లో పనిచేశారు. బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. గత మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ నుచిడి మేయర్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం లో జనరల్ సెక్రటరీ, ప్రెసిడెంట్ పదవుల్లో కొనసాగారు. ఆమె కుటుంబ సభ్యుల్లో కొందరు ఇప్పటికీ హరియాణాలోని జులానా ధాన్యం మార్కెట్లో కమిషన్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. ఆమె అప్పుడప్పుడు తన స్వస్థలాన్ని సందర్శిస్తుంటారు.