విదేశీయులకు పుట్టినవారు దేశభక్తులు కాలేరు..ఈ గడ్డపై పుట్టినవారే దేశాన్ని కాపాడతారు

వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ గడ్డపై జన్మించినవాళ్లే దేశాన్ని కాపాడతారని.. విదేశీ వనితకు జన్మించిన వాడు దేశభక్తుడు కాలేడని చాణక్యుడు చెప్పారని..రెండు దేశాల్లో పౌరసత్వం ఉన్నవారికి దేశభక్తి ఎలా ఉంటుందని పరోక్షంగా సోనియా, రాహుల్ గాంధీలపై వ్యాఖ్యలు సంధించారు. భారతదేశపు మట్టికి సంబంధించిన వ్యక్తులకు పుట్టినవారే మాతృభూమి రుణం తీర్చుకుంటారని వ్యాఖ్యానించారు.
దీనిపై కాంగ్రెస్ పార్టీ నిశిత పరిశీలన చేసుకోవాలని, దేశభక్తి, నీతి, నైతికతలు లాంటివి కాంగ్రెస్ పార్టీకి లేవని అటువంటివాటికి కాంగ్రెస్ దూరంగా ఉంటుందని విమర్శించారు. ఏ సందర్భం గురించి ఎప్పుడు ఎలా మాట్లాడాలో కాంగ్రెస్ పార్టీ నేతలకు తెలియదని అన్నారు.
భారత్-చైనాతో సరిహద్దులో ఉత్రిక్తత వాతావరణం నెలకొన్న క్రమంలో భారతదేశ భద్రతా సమస్యలను బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు పరిష్కరిస్తుందనీ ఆదివారం (జూన్ 29,2020)న ప్రధాని నరేంద్రమోడీని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ కాంగ్రెస్ పార్టీపైనా..ఆ పార్టీ అధినాయకత్వంపైనా ఇటువంటి పరోక్ష విమర్శలు చేశారు.