ఢిల్లీలో పేలుడు నేపథ్యంలో ఎయిర్ పోర్టులకు హై అలర్ట్

ఢిల్లీలో పేలుడు నేపథ్యంలో ఎయిర్ పోర్టులకు హై అలర్ట్

Updated On : January 30, 2021 / 11:36 AM IST

blast in Delhi : దేశ రాజధాని ఢిల్లీలో సంభవించిన భారీ పేలుడు ఒక్కసారిగా కలకలం రేపుతోంది. ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం వద్ద పేలుడు జరిగింది. ఈ పేలుడు ధాటికి అక్కడున్న మూడుకార్లు ధ్వంసం అయ్యాయి. ఢిల్లీలోని అబ్దుల్ కలాం రోడ్డులో ఉన్న ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం నుంచి సుమారు 50 మీటర్ల దూరంలో ఈ పేలుడు సంభవించింది. ఘటన విషయం తెలిసిన వెంటనే అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవం ముగింపు వేడుకలు జరిగిన సమయంలోనే అక్కడకు ఒక కిలోమీటర్ దూరంలో ఈ పేలుడు జరిగింది. పేలుడు జరిగినట్టు ఢిల్లీ పోలీస్ కమిషనర్ ధ్రువీకరించారు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ పేవ్‌మెంట్ కింద IED అమర్చినట్టు గుర్తించారు. పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ వినియోగించినట్లు అనుమానిస్తున్నారు. బీటింగ్ రీ ట్రీట్ జరుగుతున్న సమయంలో విజయ్ చౌక్‌కి కిలోమీటర్ దూరంలో ఈ ఘటన జరిగింది.

ఈ పేలుడులో ఎవరికైనా గాయాలు అయ్యాయా? అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక పేలుడు జరిగిన వెంటనే పెద్ద ఎత్తున భద్రతా బలగాలు అక్కడకు చేరుకున్నాయి. ఇతర దేశాల రాయబార కార్యాలయాలు ఉండే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. ఆయా కార్యాలయాలను అప్రమత్తం చేశారు. ఇక పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అనుమానాస్పదంగా ఆ ప్రాంతంలో ఎవరైనా తిరిగారా? అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు.

పేలుడు నేపథ్యంలో ఇతర దేశాల రాయబార కార్యాలయాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఢిల్లీలో పేలుడు నేపథ్యంలో ఎయిర్ పోర్టులకు హై అలర్ట్ ప్రకటించారు. ముంబైలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. దేశంలోని పలు విమానాశ్రయాల్లో ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

నేడు ఇజ్రాయిల్ ప్రత్యేక ప్రతినిధుల బృందం ఢిల్లీకి రానున్నాయి. పేలుడు ప్రాంతాన్ని పరిశీలించనుంది. భారత దర్యాప్తు బృందాలపై పూర్తి నమ్మకం ఉందని ఇజ్రాయిల్ ప్రధాని అన్నారు. ఢిల్లీలో పేలుడు ఉగ్రవాద చర్యగా ఇజ్రాయిల్ భావిస్తోంది.