Boatman Pintu Mahara : మహాకుంభమేళా ద్వారా అనేక కుటుంబాలు లాభపడ్డాయని ఇటీవల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఓ కుటుంబం 130 బోట్లను నడిపించి 30 కోట్లు సంపాదించిందని సీఎం యోగి స్వయంగా చెప్పారు. దీంతో ఒక్కసారిగా ఈ వార్త వైరల్ అయ్యింది. బోట్లు నడిపి 30 కోట్లు సంపాదించిన కుటుంబం ఏది? ఆ వ్యక్తి ఎవరు? అతడి పేరు ఏంటి? అసలు ఇదెలా సాధ్యమైంది? అనే వివరాలు తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపిస్తున్నారు.
స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా ప్రశంసలు పొందిన వ్యక్తి స్పందించారు. మహాకుంభమేళాలో తాను ఎలా 30 కోట్లు సంపాదించింది, దాని వెనుక తాను పడ్డ కష్టం, తన సక్సెస్ స్టోరీ వెనకున్న శ్రమ.. ఈ వివరాలను ఆయన తెలియజేశారు. ఒక్కరోజులోనే ఈ అద్భుతం జరగలేదని, తన సక్సెస్ వెనుక అనేక నెలల కృషి, శ్రమ, కష్టం, పట్టుదల దాగుందని పింటు మహరా తెలిపారు.
”2019లో అర్ధ కుంభ్ సమయంలో పడవ నడిపే వారు చాలా డబ్బు సంపాదించారు. లక్షలు సంపాదించారు. ఆ సమయంలో చాలా మంది భక్తులు తరలివచ్చారు. ఇది చూసి, మహాకుంభ్ లో దాదాపు 70 కోట్ల మంది భక్తులు వస్తారని నేను ఊహించాను. బోట్లు నడిపితే మంచి సంపాదన వస్తుందని ఆశించాను” అని మహరా చెప్పారు. అదే తనలో ప్రేరణ నింపిందన్నారు. ఆ ప్రేరణతోనే మహాకుంభ్ లో బోట్లను నడిపించేలా చేసిందని వివరించారు.
45 రోజుల మహాకుంభ్ లో భక్తులకు సేవలు అందించేలా 70 పడవలను నిర్మించే ప్రాజెక్ట్ కు నిధులు సమకూర్చడానికి ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు మహరా తెలిపారు. బోట్ల తయారీకి తగినంత డబ్బు లేదన్నారు. అందుకోసం లోన్లు తీసుకోవడంతో పాటు తన ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను కూడా తాకట్టు పెట్టాల్సి వచ్చిందన్నారు.
”జీవితం చాలా కష్టంగా ఉండేది. పడవలు కొనడానికి అప్పులు చేయాల్సి వచ్చింది. ఇంట్లో ఉన్న బంగారం తాకట్టు పెట్టాల్సి వచ్చింది. పడవలు సిద్ధం చేయడానికి ఆరు నెలలు పట్టింది. నేను చాలా మంది దగ్గర అప్పు తీసుకున్నా, నా కుటుంబ సభ్యుల బంగారాన్ని కూడా తాకట్టు పెట్టాను” అని మహరా వాపోయారు.
”ఈ ప్రాజెక్ట్ వల్ల పని భారం బాగా ఎక్కువైంది. శారీరక ఒత్తిడికి దారి తీసింది. కొన్నిసార్లు అనారోగ్యం పాలయ్యాను. అయితే, నా టీమ్ సభ్యులు నిబద్ధతతో పని చేశారు. వారి వల్ల నేను గట్టెక్కగలిగాను” అని వారికి కృతజ్ఞతలు తెలిపారు మహరా.
”ఈ ప్రాజెక్ట్ లో నా సోదరులు నాకు అండగా నిలిచారు. ఇది కష్టతరమైన పని. కానీ, అనుభవం అమూల్యమైనది. ధనవంతులు, పేదలు, దివ్యాంగులు అనే తేడా లేకుండా అందరూ పవిత్ర స్నానం చేయడానికి మేము సాయం చేశాం. మా కుటుంబం మొత్తం డబ్బు సంపాదించింది. మొత్తం పడవ నడిపే సమాజం డబ్బు సంపాదించింది” అని మహరా గుర్తు చేసుకున్నారు.
Also Read : బంగారం కొనడంలో మనమే టాప్.. ధరలు తగ్గడమే ఆలస్యం.. తెగ కొనేస్తున్నారు మనోళ్లు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!
ఈ ప్రాజెక్ట్ కోసం 300 మందికి పైగా ఉద్యోగులను నియమించుకున్నట్లు మహరా తెలిపారు. బోట్లు నడపటమే కాదు.. పడవ ప్రయాణాలలో భక్తులకు సాయం చేయడం, స్నాన ఏర్పాట్లు చేయడం, ఇతర సేవలు అందించేలా వారికి మార్గనిర్దేశం కూడా చేశానని తెలిపారు. మేము ఎంతో కష్టపడ్డాం, ఆ గంగా మాత మా మొరను ఆలకించారు అని మహరా ఆనందం వ్యక్తం చేశారు.
కాగా.. పడవ నడిపే వారిని దోపిడీ చేశారనే ప్రతిపక్షాల ఆరోపణలను బోటు నడిపే వ్యక్తి ఒకరు తిరస్కరించారు. తాము చాలా డబ్బు సంపాదించామన్నారు. ప్రతిపక్షం ఏదైనా చెప్పొచ్చని ఆయన మండిపడ్డారు.