రచ్చ రచ్చ : పీటల పైనుంచి పెళ్లి కూతురు జంప్

కళ్యాణ మండపంలో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. పీటల మీద పెళ్లి కొడుకు రెడీగా ఉన్నాడు. మరి కొద్ది సేపట్లో ముహూర్తం. పెళ్లి కొడుకు వధువు మెడలో మూడు ముళ్లు వేస్తే ఇంక వివాహా తంతు ముగిసినట్టే. ఇంతలో ఊహించని సంఘటన జరిగింది. చీర మార్చుకోవడానికి గదిలోకి వెళ్లిన పెళ్లి కుమారై అదృశ్యమైంది. తమిళనాడులోని గుడియాత్తంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే… వేలూరు జిల్లా వణియంబాడికి చెందిన ఐశ్వర్య అనే యువతికి గుడియాత్తంకు చెందిన మేనమామ వినాయకంతో పెళ్లి ఖాయం చేశారు పెద్దలు. ముహూర్తాలు పెట్టుకుని కుటుంబ సభ్యులు గుడియాత్తంలోని మెల్పట్టిరోడ్డులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో వివాహం చేయటానికి ఏర్పాట్లు చేశారు. సెప్టెంబర్ 2వతేదీ సోమవారం ముహూర్తం కాగా… ఆదివారం రాత్రి విందు కూడా జరిగింది. సోమవారం ఉదయం పెళ్లి కార్యక్రమం మొదలైంది.పెళ్లిలో భాగంగా కుటుంబీకులు నలుగు కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం చీర మార్చుకునేందుకు గదిలోకి వెళ్లిన వధువు ఎంతసేపటికీ బయటకు రాలేదు. అనుమానం వచ్చిన బంధువులు గదిలోకి వెళ్లి చూశారు. అక్కడ పెళ్లి కుమార్తె కనిపించలేదు. గదిలోకి వెళ్లిన పెళ్లికుమార్తె అక్కడ్నించి ఆదృశ్యమయ్యింది. బంధువులు వెంటనే ఆమె సెల్ ఫోన్ కు కాల్ చేయగా స్విచ్చాఫ్ చేసి ఉందని సమాధానం వచ్చింది. దీంతో కంగారు పడ్డ బంధువులు ఆ చుట్టుపక్కల వెతికారు. అయినా ఆమె ఆచూకీ దొరకలేదు. పెళ్ళి ఆగిపోయింది. పెళ్లి మడపంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వధువు తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.