తమ్ముడూ చనిపోతున్నా…ఢిల్లీ అగ్నిప్రమాద బాధితుడి చివరి ఫోన్ కాల్ సంభాషణ వింటే కన్నీళ్లు ఆగవు

ఢిల్లీలోని ఝాన్సీ రోడ్‌లోని అనాజ్ మండీలోని ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఇవాళ(డిసెంబర్-8,2019)ఉదయం 5గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో 43మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఉత్తరప్రదేశ్ కి చెందిన ముషార్రఫ్ అనే ఓ వర్కర్ ప్రమాద సమయంలో తన సోదరుడితో జరిపిన చివరి ఫోన్ కాల్ సంభాషణ ఇప్పుడు అందరి హృదయాలను కలిచివేస్తుంది.
అగ్నిప్రమాదం సమయంలో ముషార్రఫ్ తన సోదరుడికి ఫోన్ చేసి…తమ్ముడు నేను చనిపోబోతున్నాను. ఇక్కడ అంతా మంటలు అలుముకున్నాయి.తప్పించుకోవడానికి దారి లేదు. ఇంకో మూడు, నాలుగు నిమిషాల సమయం మాత్రమే నాకుంది. నేను చనిపోయినా కూడా నీతోనే ఉంటాను. నా భార్యని,పిల్లను జాగత్రగా చూసుకో. నేను ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను. వచ్చి నన్ను తీసుకెళ్లు తమ్ముడూ. ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకో అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఆదివారం తెల్లవారుజామున ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ సమయంలో అందులో పనిచేస్తున్న కార్మికులు నిద్ర పోయారు. గాఢ నిద్రలో ఉండడంతో ప్రమాద విషయం తెలియలేదు. తెలిసేసరికి అప్పటికే ఆలస్యం అయిపోయింది. తప్పించుకోవడానికి వారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. భారీగా పొగ కమ్ముకోవడంతో తీవ్ర అవస్థలు పడ్డారు. ఊపిరిఆడక చాలా మంది సృహ తప్పిపడిపోయారు. 43 మంటల్లో సజీవ దహనమయ్యారు. మరికొందరు తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.