మౌలిక సదుపాయాలకు, కొత్త ఉద్యోగాల కల్పనకు పెద్దపీట, నిర్మలమ్మ మూడో బడ్జెట్

మౌలిక సదుపాయాలకు, కొత్త ఉద్యోగాల కల్పనకు పెద్దపీట, నిర్మలమ్మ మూడో బడ్జెట్

Updated On : February 1, 2021 / 2:07 PM IST

Budget to focus on job creation, : మౌలిక సదుపాయాలకు, కొత్త ఉద్యోగాల కల్పనకు పెద్ద పీటవేస్తూ మూడో బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. కరోనా వ్యాక్సినేషన్‌కు, రైల్వేల అభివృద్ధికి, రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. రైల్వేల ప్రయివేటీకరణపై చర్చ జరుగుతున్న వేళ 2వేల30వ సంవత్సరం వరకు అవసరాలకు సరిపడే విధంగా రైల్వేల అభివృద్ధి ప్రణాళికలు ప్రకటించారు.
అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, కేరళ, అసోం, పశ్చిమబెంగాల్‌పై వరాల జల్లు ప్రకటించారు. ఖరగ్ పూర్, విజయవాడ మధ్య ఈస్ట్ కోస్ట్ సరుకు రవాణా కారిడార్ రైల్వే లైన్ అభివృద్ధి చేస్తామని తెలిపారు. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచారు. ఇప్పటిదాకా 49శాతంగా ఉన్న విదేశీ పెట్టుబడులను 74శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించారు.

దేశవ్యాప్తంగా ఐదు వ్యవసాయ హబ్‌లు ఏర్పాటుచేస్తున్నట్టు నిర్మల ప్రకటించారు. కనీస మద్దతు ధర ఎప్పటికప్పుడు పెంచుతామన్నారు. గృహరుణాలపై పన్ను మినహాయింపు మరో ఏడాది పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. ఐటీ రిటర్న్స్‌ నుంచి సీనియర్ సిటిజన్లకు మినహాయింపు ఇచ్చారు. 75 ఏళ్లు దాటిన వృద్ధులకు మినహాయింపు లభించింది. నిర్మల బడ్జెట్ ప్రకారం బంగారం, వెండి ధరలు తగ్గనున్నాయి. మొబైల్ ధరలు పెరగనున్నాయి. కార్ల విడిభాగం ధరలు పెరగనున్నాయి. నిర్మల బడ్జెట్‌కు మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. బ్యాంకింగ్, ఇన్ ఫ్రా షేర్లు లాభాల బాట పట్టాయి. ఒక దశలో సెన్సెక్స్ 900పాయింట్లకు పైగా లాభపడింది.

దేశ చరిత్రలో తొలిసారి కాగిత రహిత బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్. సంప్రదాయానికి భిన్నంగా బడ్జెట్ పుస్తకం కాకుండా… మేడిన్ ఇండియా ట్యాబ్‌ చూస్తూ బడ్జెట్ చదివారు. క్యాబినెట్ ఆమోదం తర్వాత 2021-22 వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు నిర్మల. పార్లమెంట్‌లో మూడోసారి నిర్మల బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన తొమ్మిదో బడ్జెట్ ఇది.