నిరుద్యోగులకు లక్షల్లో ఉద్యోగాలు.. మనకు కాదులే

74వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా పంజాబ్ ముఖ్యమంత్రి వరాలు జల్లు కురిపించారు. ఆ రాష్ట్రానికి చెందిన నిరుద్యోగులకు 6 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ రంగంలో లక్ష ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలో 5లక్షల ఉద్యోగాలకు అవకాశాలు కల్పిస్తామని మాటిచ్చారు. ప్రభుత్వం ఘర్ ఘర్ రోజ్‌గార్ పథకం ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకూ 13లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించామని తెలిపారు.
భూమి లేని రైతులు, కూలీలకు ఆర్థిక సహాయం అందించేందుకు రూ.520కోట్లు కేటాయించామని స్పష్టం చేశారు. కౌలు రైతుల కోసం త్వరలోనే తమ గవర్నమెంట్ కొత్త చట్టాన్ని ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి దోహదపడే మౌలిక సౌకర్యాల కల్పనకే అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నామని అన్నారు. జాతీయ రహదారుల కల్పనకు రాబోయే రెండేళ్లలో రూ.12వేట కోట్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఆరోగ్య కార్యకర్తలు ధైర్యంతో సేవలందిస్తున్నారని అమరీందర్ సింగ్ కొనియాడారు. దాంతో పాటు దేశ విద్రోహ పనులు చేసే గుర్పత్వంత్ సింగ్ పన్ను, సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ)లకు వార్నింగ్ ఇచ్చారు. ‘ఒక సారి పంజాబ్ రావడానికి ప్రయత్నించండి. మీకొక పాఠం నేర్పిస్తాను’ అని సీఎం అమరీందర్ సింగ్ అన్నారు.