Center warns: కేంద్రం హెచ్చరిక.. కరోనా తీవ్రం కావచ్చు.. 5-10 శాతం మందే ఆసుపత్రుల్లో!

కరోనా సోకిన రోగులలో ఐదు నుంచి పది శాతం మంది మాత్రమే ఆసుపత్రులలో చేరాల్సి వస్తుందని కేంద్రం వెల్లడించింది.

Center warns: కేంద్రం హెచ్చరిక.. కరోనా తీవ్రం కావచ్చు.. 5-10 శాతం మందే ఆసుపత్రుల్లో!

Corona Hospital

Updated On : January 11, 2022 / 7:57 AM IST

Center warns: కరోనా సోకిన రోగులలో ఐదు నుంచి పది శాతం మంది మాత్రమే ఆసుపత్రులలో చేరాల్సి వస్తుందని కేంద్రం వెల్లడించింది. పరిస్థితి ఇంకా దారుణంగా మారవచ్చని అటువంటి పరిస్థితిలో కూడా హోమ్ ఐసోలేషన్‌లోనే మెజారిటీ ప్రజలు ఉంటే సరిపోతుందని, ఆసుపత్రిలో చేరిన రోగులపై మాత్రం నిఘా ఉంచాలని సూచించింది కేంద్రం. దేశంలో సెకండ్ వేవ్ సమయంలో, ఆసుపత్రిలో చేరిన రోగుల శాతం 20-23 శాతం ఉన్నట్లుగా కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు.

దేశంలోని వివిధ ప్రాంతాలకు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కరోనా కేసులు గణనీయంగా పెరిగాయని, అదే సమయంలో డెల్టా వేరియంట్ ప్రభావం ఇంకా కొనసాగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసుల సంఖ్య, హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులు, ఆక్సిజన్ బెడ్స్ అవసరమైన రోగులు, ఐసీయూ బెడ్స్, వెంటిలేషన్ అవసరమైన కోవిడ్ రోగులను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

డెల్టా ప్రభావం మళ్లీ దేశంలో స్పష్టంగా కనిపిస్తోందని, ప్రస్తుత పరిస్థితిలోనే రాష్ట్రాలు వేగంగా మానవ వనరులను పెంచుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. ముఖ్యంగా ఆరోగ్య కార్యకర్తల సంఖ్య పెరగాల్సిన అవసరం కూడా ఉందని లేఖలో స్పష్టం చేసింది కేంద్రం. చికిత్స పొందుతున్న మొత్తం రోగుల సంఖ్య, హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న రోగుల సంఖ్య, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య, ఆక్సిజన్ బెడ్‌లు ఉన్న రోగుల సంఖ్య గురించి అన్నీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రతిరోజూ సమాచారం అందించాలని లేఖలో కోరారు. ఐసీయూ బెడ్లు, లైఫ్ సపోర్టు అవసరం తదితర విషయాలపై ప్రభుత్వం నిఘా ఉంచాలని సూచించారు. “ఆరోగ్య కార్యకర్తల ఆవశ్యకత మరియు ఆసుపత్రులు/చికిత్స కేంద్రాలలో వారి లభ్యతను రెండవ వేవ్ సమయంలో చేసినట్లుగా ప్రతిరోజూ సమీక్షించాలి” అని ఆరోగ్య కార్యదర్శి చెప్పారు.

భారీ ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ ఆసుపత్రులు, తాత్కాలిక ఆసుపత్రులు ప్రారంభించడం వంటి చర్యలు తీసుకున్న వివిధ రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాలను అభినందిస్తూ, మౌలిక సదుపాయాలు, మానవ వనరులకు పరిమితులు ఉన్నాయని, వీలైన చోట, వారికి సహాయం చేయడానికి ప్రత్యేక ఆరోగ్య కార్యకర్తల బృందాలను సృష్టించాలని భూషణ్ కోరారు.

కోవిడ్ కేర్ సెంటర్లలోని కమ్యూనిటీ వాలంటీర్లకు టెలి-కన్సల్టేషన్ సేవలు.. నైపుణ్య శిక్షణ కోసం రిటైర్డ్ వైద్య నిపుణులు, MBBS విద్యార్థులను నిమగ్నం చేయాలని సూచించారు. హోమ్ ఐసోలేషన్ లేదా కోవిడ్ కేర్ సెంటర్‌ల నుంచి రోగులను సులువుగా తరలించడానికి అదనపు అంబులెన్స్‌లు లేదా ప్రైవేట్ వాహనాలను ఏర్పాటు చేసుకోవాలని సూచనలు చేశారు.