పాడి రైతులకు శుభవార్త.. కేంద్ర మంత్రి మండలి కీలక నిర్ణయం.. అదేమిటంటే?

పాడి రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశంలో పాల ఉత్పత్తిని, దేశీయ పశువుల జాతుల ఉత్పాదకతను పెంచడానికి ..

పాడి రైతులకు శుభవార్త.. కేంద్ర మంత్రి మండలి కీలక నిర్ణయం.. అదేమిటంటే?

Dairy farmers

Updated On : March 20, 2025 / 8:41 AM IST

Dairy Farmers: పాడి రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశంలో పాల ఉత్పత్తిని, దేశీయ పశువుల జాతుల ఉత్పాదకతను పెంచడానికి రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద రూ.3400 కోట్ల నిధులను కేటాయించింది.

 

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో పాల ఉత్పత్తిని పెంచడంతో పాటు పాడి పరిశ్రమకు అవసరమైన ఆధునిక మౌలిక వసతుల కల్పన దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రీయ గోకుల్ మిషన్ (ఆర్జీఎం), నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డెయిరీ డెవలప్ మెంట్ (ఎన్పీడీడీ) పథకాల ద్వారా చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు అదనంగా రూ.2వేల కోట్ల నిధులను కేటాయించింది. దీంతో ఈ పథకాలకు అందుబాటులోకి వచ్చే నిధుల మొత్తం రూ.6190 కోట్లకు పెరిగింది.

 

ప్రధాని మోదీ అధ్యక్షన జరిగిన కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ కు తాజాగా మరో రూ. వెయ్యి కోట్లు కేటాయించింది. దీంతో ఆర్జీఎం కార్యక్రమానికి 15వ ఆర్థిక సంఘం కాలం లో వెచ్చించి మొత్తం రూ.3,400 కోట్లకు చేరిందని తెలిపారు. ఎన్పీడీడీ కార్యక్రమానికి కూడా అదనంగా రూ. వెయ్యి కోట్ల నిధులను సమకూర్చాలని నిర్ణయించడంతో 15వ ఆర్థిక సంఘం కాలంలో వెచ్చించే మొత్తం రూ.2,790కోట్లకు చేరిందని తెలిపారు. పాల సేకరణ, సేకరించిన పాల శుద్ధికి అవసరమైన మౌలిక వసతుల ఆధునికీకరణతో పాటు నాణ్యమైన పాడి పశువుల సంతతి వృద్ధికీ ఈ నిధులను వెచ్చించనున్నారని, దీంతో రైతుల ఆదాయం మరింత పెరుగుతుందని తెలిపారు.

 

ప్రధాని నరేంద్ర మోదీ తన ఎక్స్ ఖాతాలో.. ‘‘భారతదేశ పాడి పరిశ్రమ రంగానికి ఒక పెద్ద ప్రోత్సాహం! సవరించిన జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి కార్యక్రమానికి మంత్రివర్గం ఆమోదం ఈ రంగం పరివర్తనకు దోహదపడుతుంది. రైతులకు మెరుగైన ధరలను నిర్ధారించడం, ఉద్యోగ సృష్టితోపాటు మరిన్ని ఉపయోగాలు కలుగుతాయి’’ అంటూ పేర్కొన్నారు.


ఇదిలాఉంటే.. సవరించిన ఎన్పీడీడీ కింద దేశవ్యాప్తంగా 10,000 కొత్త పాల సహకార సంఘాలు ఏర్పడతాయి. ఈశాన్యంలో పాల ప్రాసెసింగ్ సౌకర్యాలు విస్తరించబడతాయి. దీని వల్ల దాదాపు 3.2 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రత్యేక విషయం ఏమిటంటే, లబ్ధిదారులలో 70శాతం మంది మహిళలు, వారు పాడి రంగంలో ప్రధాన శ్రామిక శక్తి.