Ration Delivery Scheme : రేషన్ డోర్ డెలివరీ పథకంపై కేంద్రం నిషేధం, రాష్ట్ర ప్రభుత్వానికి బిగ్ షాక్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ఇచ్చింది. రేషన్ స్కీమ్‌పై ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం నో చెప్పింది. ఢిల్లీ ప్రభుత్వ డోర్‌స్టెప్ డెలివరీ ఆఫ్ రేషన్ స్కీమ్ (ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రేషన్ యోజన)ను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది.

Ration Delivery Scheme : రేషన్ డోర్ డెలివరీ పథకంపై కేంద్రం నిషేధం, రాష్ట్ర ప్రభుత్వానికి బిగ్ షాక్

Centre Blocks Doorstep Ration Delivery Scheme

Updated On : March 20, 2021 / 8:27 AM IST

Centre blocks doorstep ration delivery scheme : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ఇచ్చింది. ఇంటింటికీ సరుకులు పంపిణీ చేసే రేషన్ స్కీమ్‌కు కేంద్ర ప్రభుత్వం నో చెప్పింది. ఢిల్లీ ప్రభుత్వ డోర్‌స్టెప్ డెలివరీ ఆఫ్ రేషన్ స్కీమ్ (ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రేషన్ యోజన)ను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఈ మేరకు శుక్రవారం(మార్చి 19,2021) వినియోగదారుల వ్యవహారాల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

కొత్త పేర్లతో కానీ, పథకాలతో కానీ రేషన్ పంపిణీకి అనుమతుల్లేవు:
దీనిని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం… జాతీయ ఆహార భద్రతా పథకం కింద తాము రాష్ట్రాలకు రేషన్ ఇస్తున్నామని, అందువల్ల దానిలో ఎలాంటి మార్పులూ చేయరాదని స్పష్టం చేసింది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద కేంద్రం పంపిణీ చేసే ఆహార ధాన్యాలను కొత్త పేర్లతో కానీ, పథకాలతో కానీ సరఫరా చేయడానికి రాష్ట్రాలకు అనుమతులు లేవని నోటిఫికేషన్‌లో కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.

రేషన్ మాఫియాకు సహకరించేందుకే:
షెడ్యూల్ ప్రకారం మార్చి 25 నుంచి ఇంటింటికి నేరుగా రేషన్ అందజేసే రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్ మొదలు కావాల్సి ఉంది. చూస్తుంటే.. కేజ్రీవాల్ ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య దూరం అంతకంతకూ పెరుగుతున్నట్టు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఇంటింటికీ రేషన్ పథకాన్ని కేంద్రం అడ్డుకోవడంపై ఆప్ సర్కార్ మండిపడింది. ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయం అని మండిపడింది. రేషన్ మాఫియాకు సహకరించేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆరోపించింది. రేషన్ మాఫియాకు చరమగీతం పాడటాన్ని మోదీ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తోందంటూ నిలదీసింది.

అగ్గిమీద గుగ్గిలం:
ఇప్పటికే లోక్‌సభలో కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన ‘ద గవర్న్‌మెంట్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు-2021’పై కేజ్రీవాల్ సర్కార్ అగ్గిమీద గుగ్గిలమవుతోంది. దీనిని నిరసిస్తూ ఆప్ నేతలు, కార్యకర్తలు జంతర్‌మంతర్ దగ్గర నిరసన ప్రదర్శనలు కూడా నిర్వహించారు. ఢిల్లీ ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నర్ అని చెప్పడమే ఈ బిల్లు ఉద్దేశమని, ఇదే జరిగితే ముఖ్యమంత్రి ఎక్కడకి వెళ్తారని కేజ్రీవాల్ ప్రశ్నించారు. తాజాగా రేషన్ స్కీమ్‌పైనా కేంద్రం నిషేధం పెట్టడంతో కేజ్రీవాల్ ప్రభుత్వం అగ్గిమీద గుగ్గిలమవుతోంది.

గుజరాత్ లో ఆప్ విజయాలు ఓర్వలేకనే:
ఢిల్లీ ప్రభుత్వ అధికారాలకు కోత పెట్టే సవరణ బిల్లు ప్రజాస్వామ్య వ్యతిరేకమే కాకుండా, రాజ్యాంగ వ్యతిరేకమని, సుప్రీంకోర్టు ధర్మాసనం గతంలో చెప్పిన తీర్పును ఉల్లంఘించడమేనని కేజ్రీవాల్ చెబుతున్నారు. ఎన్నికైన ప్రభుత్వ అధికారాలను బిల్లు ద్వారా కుందించేందుకు బీజేపీ హేయమైన చర్యకు దిగిందని, ఢిల్లీలో బీజేపీని ఓటర్లు ఇటీవల తిరస్కరించడం, గుజరాత్‍లోనూ ఆప్ విజయాలు సొంతం చేసుకోవడం చూసి ఓర్వలేకనే ఇలాంటి కుటిల యత్నాలకు కేంద్రం పాల్పడుతోందని సీఎం మండిపడుతున్నారు.

ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రేషన్ యోజన:
కాగా, ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రేషన్ యోజన పథకం ద్వారా ఇంటింటికి రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేయాలని సీఎం కేజ్రీవాల్ స్కీమ్ తీసుకొచ్చారు. మార్చి 25 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. ఈ పథకం కింద ప్యాకేజ్ చేసిన గోధుమపిండి, బియ్యం, చక్కెర లబ్దిదారులకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇంతలో కేంద్రం…కేజ్రీవాల్ సర్కార్ కు గట్టి షాక్ ఇచ్చింది.

ఏపీలో ఏం జరగనుంది? రేషన్ డోర్ డెలివరీ పథకం కొనసాగుతుందా?
రేషన్ డోర్ డెలివరీ స్కీమ్ ని నిలిపివేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంతో అందరి చూపు ఏపీపై పడింది. ఎందుకంటే, ఏపీలో జగన్ ప్రభుత్వం రేషన్ డోర్ డెలివరీ చేస్తున్న సంగతి తెలిసిందే. రేషన్ డోర్ డెలివరీ పథకాన్ని సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారు. ఇందుకోసం పెద్ద వ్యవస్థనే ఏర్పాటు చేశారు. ప్రత్యేక వాహనాల ద్వారా గ్రామ, వార్డు వాలంటీర్ల సాయంతో రేషన్ సరుకులను లబ్దిదారులకు నేరుగా ఇంటికే సరఫరా చేస్తున్నారు. సీఎం జగన్ బొమ్మలతో ప్రత్యేకంగా గుర్తించిన బ్యాగుల్లో బియ్యం ఇస్తున్నారు. అలాగే ప్యాకేజ్ చేసిన చక్కెర, కందిపప్పు ఇస్తున్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘంపై న్యాయపోరాటం చేసి మరీ.. రేషన్ డోర్ డెలివరీ పథకాన్ని కొనసాగించారు సీఎం జగన్. అంటే, ఈ స్కీమ్ ను జగన్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థమవుతుంది.

రాష్ట్రాలకు ఆ అనుమతి లేదు:
జాతీయ ఆహార భద్రతా పథకం కింద తాము రాష్ట్రాలకు రేషన్ ఇస్తున్నామని, అందువల్ల దానిలో ఎలాంటి మార్పులూ చేయరాదని కేంద్రం స్పష్టం చేయడం ఆసక్తికరంగా మారింది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద కేంద్రం కేటాయించిన ధాన్యాన్ని మరే ఇతర పథకం ద్వారా పంపిణీ చేయడానికి రాష్ట్రాలకు అనుమతి లేదని నోటిఫికేషన్‌లో కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ రూల్స్ ని గుర్తు చేసిన కేంద్రం..ఢిల్లీ విషయంలో కఠినంగా వ్యవహరించిన కేంద్రం.. మరిప్పుడు ఏపీ విషయంలో ఎలా వ్యవహరిస్తుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో రేషన్ డోర్ డెలివరీ పథకం కొనసాగుతుందా? లేక కేంద్రం బ్రేకులు వేస్తుందా? అనేది ఇంట్రస్టింగ్ గా మారింది.