భారత రాఫెల్ యుద్ధ విమానాలకు కౌంటర్‌గా పెద్ద ప్లాన్ వేసి.. సరిహద్దుల వద్ద అమలు చేస్తున్న చైనా

China: అక్కడి ఎయిర్‌బేస్ భారత సరిహద్దు నుంచి కేవలం 150 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.

భారత రాఫెల్ యుద్ధ విమానాలకు కౌంటర్‌గా పెద్ద ప్లాన్ వేసి.. సరిహద్దుల వద్ద అమలు చేస్తున్న చైనా

Updated On : May 31, 2024 / 8:35 PM IST

ఫ్రాన్స్‌ నుంచి భారత్ దిగుమతి చేసుకున్న అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలు చైనా గుండెల్లో దడ పుట్టిస్తున్నట్లున్నాయి. రాఫెల్‌-ఎం విమానాలను కూడా భారత నేవీ అమ్ములపొదిలో చేర్చుకునేందుకు కేంద్ర సర్కారు ఫ్రాన్స్ తో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే.

దీంతో రాఫెల్ కు కౌంటర్ గా చైనా అధునాతన స్టెల్త్ ఫైటర్ జెట్లు జే-20లను మోహరించింది. హై రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ విషయాలు తెలిశాయి. J-10 ఫైటర్లు కూడా అందులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి షిగాట్సే ఎయిర్ బేస్ వద్ద ఉన్నట్లు హై రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలిసింది.

టిబెట్‌లోని రెండో అతిపెద్ద నగరం షిగాట్సే. అక్కడి ఎయిర్‌బేస్ భారత సరిహద్దు నుంచి కేవలం 150 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అలాగే, బెంగాల్‌లోని హసిమారాలోని భారత వైమానిక దళం స్థావరం నుంచి అది దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హసిమారాలోనే ఇండియా 16 రాఫెల్‌ యుద్ధ విమానాలతో రెండో స్క్వాడ్రన్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

షిగాట్సేలో పౌర, సైనిక అవసరాల కోసం చైనా విమానాశ్రయం నిర్మించింది. అక్కడే ఇప్పుడు చైనా జే-20 ఫైటర్లను మోహరించింది. అంతేగాక, ఏకేజే 500 ఎయిర్‌ బోర్న్‌ ఎర్లీ వార్నింగ్‌, కంట్రోల్‌ ఎయిర్‌క్రాఫ్ట్ ను కూడా మోహరించింది. చైనా తీరుపై భారత్ ఇప్పటివరకు అధికారికంగా ఏ వ్యాఖ్యా చేయలేదు. గత ఏడాది కూడా చైనా జే-20 ఫైటర్లను ఇదే విధంగా మోహరించింది.

భారత్ ప్రస్తుతం మొత్తం కలిపి 36 జెట్లతో రెండు రాఫెల్ స్క్వాడ్రన్లను నిర్వహిస్తోంది. చైనా ఇప్పటికే దాదాపు 250 J-20 స్టెల్త్ ఫైటర్లను అభివృద్ధి చేసుకుంది. J-20లను ముఖ్యంగా చైనా తూర్పు సరిహద్దులో, పసిఫిక్ సముద్రతీరాన్ని రక్షించడానికి వాడుతుంటుంది.

Also Read: శత్రు దుర్భేద్యంగా నేవీ.. భారత నేవీ అమ్ములపొదిలో రాఫెల్‌ యుద్ధ విమానాలు