అయోధ్యలో భూమి పూజ, రాముడి ప్రసాదం అందుకున్న దళితుడు

అయోధ్య రామాలయ నిర్మాణంలో భూమి పూజ కార్యక్రమం అనంతరం రాముడి ప్రసాదాన్ని మొట్టమొదటగా ఓ దళితుడు అందుకున్నారు. ప్రసాదాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ పంపారు. ప్రసాదంలో లడ్డూ, రామచరిత మానస్, తులసీ మాల ఉన్నాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మీడియా సలహాదారు శాలబ్ మణి త్రిపాఠి వెల్లడించారు.
అయోధ్యలోని సుధతి ప్రాంతంలో ఉంటున్న మహవీర్ కుటుంబం ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. ఇతను ఎవరు ? ఎక్కడుంటారు ? తదితర వివరాలను తెలుసుకొనేందుకు ఆసక్తి చూపారు.
తనకు ప్రసాదం పంపినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నాడు మహవీర్. తాను దళితుడని పట్టించుకోలేదని, ఇంకా తనను గుర్తు పెట్టుకున్నందుకు రుణపడి ఉంటానన్నాడు. తాము రెండు విధాలుగా సంతోషంగా ఉన్నామని, 1. రామ మందిరం నిర్మాణమవుతుండడం, 2. రెండోది తొలి ప్రసాదం అందుకోవడమన్నారు. కుల వివక్ష ఉండదని తాను భావిస్తున్నట్లు, అభివృద్ధి, సంక్షేమం పైనే దృష్టి పెడతారని ఆశిస్తున్నట్లు తెలిపారు మహవీర్.
మహవీర్ ఓ దళితుడు. ఇతను భవన నిర్మాణ కార్మికుడుగా పని చేస్తున్నారు. 2019లో జరిగిన ఎన్నికల సందర్భంగా యోగి..మహవీర్ నివాసానిక వెళ్లారు. అక్కడే వారితో భోజనాలు చేశారు. ఇలా తరచూ బీజేపీతో సంబంధాలున్నాయి. మొత్తానికి రాముడి ప్రసాదం ఓ దళితుడికి పంపించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది.