ఆగస్టు-14 వరకు….హోటల్ లోనే రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

ఎట్టకేలకు ఆగస్టు 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వచించేందుకు రాజస్థాన్ గవర్నర్ అంగీకరించారు. ఈ సమయంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా హోటల్‌లోనే ఉండనున్నారు. జైపూర్‌లోని హోటల్ ఫెయిర్‌మాంట్‌లో సీఎం అశోక్ గెహ్లాట్ ఆధ్వర్యంలో గురువారం కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే ఆగస్టు 14 వరకు ఎమ్మెల్యేలంతా హోటల్‌లోనే ఉండాలని సీఎం గెహ్లాట్ చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంత్రులు తమ విధుల కోసం సచివాలయానికి వెళ్లి రావచ్చని ఆయన పేర్కొన్నట్లు తెలిపాయి.
తమ ప్రభుత్వ బలాన్ని నిరూపించుకుంటామని, అసెంబ్లీని సమావేశ పర్చాలంటూ సీఎం గెహ్లాట్ పలుమార్లు పంపిన ప్రతిపాదనను గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా గతంలో తిరస్కరించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ సమావేశానికి ప్రభుత్వం సరైన కారణం చెప్పని పక్షంలో 21 రోజుల ముందుగా నోటీసు ఇవ్వాలని చెప్పారు.
ఈ మేరకు ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా ఎట్టకేలకు బుధవారం ఆమోదం తెలిపారు. దీంతో ఆగస్టు 14న అసెంబ్లీని సమావేశపరుచనున్నట్టు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా అప్పటి వరకు హోటల్ ఫెయిర్‌మాంట్‌లోనే వారిని ఉంచనున్నట్లు తెలుస్తున్నది.