ఎంపీ టికెట్ వద్దని వాపస్ ఇచ్చేసిన కాంగ్రెస్ మహిళా నేత సుచరిత మహంతి

కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ టికెట్ దక్కించుకున్న ఓ మహిళా నాయకురాలు భిన్నంగా స్పందించారు. తనకు టికెట్ వద్దని వాపస్ ఇచ్చేశారు. ఆమె ఎందుకిలా చేశారంటే..?

Sucharita Mohanty : ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రధాన రాజకీయ పార్టీల్లోని ఆశావహులు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అధినాయకత్వాన్ని మెప్పించి టికెట్ దక్కించుకునేందుకు చాలా కష్టపడుతుంటారు. పార్టీ బీఫాంతో బరిలో దిగేందుకు చివరి నిమిషం వరకు సర్వశక్తులు ఒడ్డుతుంటారు. టికెట్ దక్కడమే గెలిచినంత సంబరంగా ఫీలవుతుంటారు. అలాంటిది జాతీయ పార్టీ తరపున ఎంపీ టికెట్ దక్కించుకున్న ఓ మహిళా నాయకురాలు మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. తనకు టికెట్ వద్దని వాపస్ ఇచ్చేశారు. ఆమె ఎందుకిలా చేశారంటే..?

ఒడిశాలోని పూరి పార్లమెంట్ స్థానానికి తమ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ సుచరిత మహంతికి టిక్కెట్ ఇచ్చింది. ఇంకొకరైతే ఇపాటికి ఎన్నికల బరిలోకి దూకి తాడోపేడో తేల్చుకునే వారు. సుచరిత మాత్రం తనకు ఇచ్చిన ఎంపీ టిక్కెట్‌ను వాప‌స్ తీసుకోవాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి(ఆర్గనైజేషన్) కె. వేణుగోపాల్‌కు లేఖ రాశారు. ఎన్నికల ప్రచారానికి తన దగ్గర డబ్బులు లేవని, పార్టీ నుంచి కూడా ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

నిధుల సేకరణకు విఫలయత్నం
“పార్టీ నాకు నిధులు ఇచ్చేందుకు నిరాకరించడంతో పూరి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించలేకపోతున్నాం. ఏఐసిసి ఒడిశా ఇన్‌చార్జి డాక్టర్ అజయ్ కుమార్ నిధులు మీకు మీరే సమకూర్చుకోవాలన్నారు. వృత్తిరీత్యా జర్నలిస్టునైన నేను పదేళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చాను. పూరిలో ఎన్నికల ప్రచారానికి నా దగ్గరున్నదంతా ఖర్చుపెట్టేశా. నా ప్రచారానికి మద్దతుగా ప్రజల నుంచి విరాళాల సేకరణకు చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. అంచనా వేసిన ప్రచార వ్యయాన్ని కనిష్ట స్థాయికి తగ్గించాలని కూడా చూశాను. నిధులు సమకూర్చాలని కేంద్ర నాయకత్వాన్ని అభ్యర్థించాను. అయినా సందన లేకపోవడంతో పూరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించలేపోతున్నాం. దీంతో నాకు ఇచ్చిన ఎంపీ టికెట్‌ను తిరిగి ఇచ్చేస్తున్నాన”ని సుచరిత తన లేఖలో పేర్కొన్నారు. కాగా, తన ట్విటర్ ఖాతాలో క్యూఆర్ కోడ్ పెట్టి ఆమె విరాళాలు అభ్యర్థించారు.

Also Read: రాహుల్ ఏంటిది.. ముందే ఎందుకు చెప్పలేదు?: సీపీఎం మహిళా నేత ఫైర్

పార్టీ పట్టించుకోలేదు
దీనిపై ఆమె మీడియాతో మాట్లాడుతూ.. “పార్టీ నాకు నిధులు ఇవ్వలేకపోయింది. అంతేకాకుండా నా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో బలహీన అభ్యర్థులను ఉద్దేశపూర్వకంగా నిలబెట్టారు. నలుగురు అసెంబ్లీ అభ్యర్థులను మార్చాలని అడిగినా పట్టించుకోలేదు. స్వంతంగా నిధులు సమకూర్చుకోవాలని చెప్పి చేతులు దులుపుకుంది. మరోవైపు అధికారపక్షం అన్నిచోట్ల డబ్బులు వెదజల్లుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సరిపడా నిధులు లేకుండా నేను ఎన్నికల్లో పోరాడలేన”ని సుచరిత అన్నారు.

Also Read: కిషోరి లాల్ శర్మ ఎవరు? అమేథీ కాంగ్రెస్ అభ్యర్థిగా అధిష్టానం ఇతన్నే ఎందుకు ఎంపిక చేసింది..

ట్రెండింగ్ వార్తలు