రెండు స్థానాల్లో రాహుల్ గాంధీ పోటీ.. సీపీఎం మహిళా నేత అన్నీ రాజా ఫైర్

వాయనాడ్ పోలింగ్ ముగిసిన తర్వాత రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ నామినేషన్ వేయడంపై సీపీఎం మహిళా నాయకురాలు అన్నీ రాజా అభ్యంతరం వ్యక్తం చేశారు.

రెండు స్థానాల్లో రాహుల్ గాంధీ పోటీ.. సీపీఎం మహిళా నేత అన్నీ రాజా ఫైర్

Annie Raja on Rahul Gandhi: తమ కుటుంబానికి కంచుకోట అయిన యూపీలోని రాయ్‌బరేలీ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. కేరళ నుంచి వాయనాడ్ నుంచి ఇప్పటికే పోటీలో నిలిచారు. రెండో స్థానం నుంచి పోటీకి సిద్ధమైన రాహుల్ గాంధీని సీపీఎం మహిళా నాయకురాలు అన్నీ రాజా తప్పుబట్టారు. రాయ్‌బరేలీలో పోటీ గురించి వాయనాడ్ ప్రజలకు ముందే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. రెండు చోట్ల రాహుల్ గెలిస్తే.. వాయనాడ్ సీటును వదులుకుంటారని తద్వారా ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వాయనాడ్‌లో రాహుల్ గాంధీపై ఆమె పోటీ చేశారు. వాయనాడ్ పోలింగ్ ముగిసిన తర్వాత రాయ్‌బరేలీలో నామినేషన్ వేయడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. నైతికంగా ఇది కరెక్ట్ కాదని వ్యాఖ్యానించారు.

“ఇది నిర్దిష్ట నిర్ణయం కాదని నేను అనుకుంటున్నాను. అప్పటికి ఇంకా తుది నిర్ణయం తీసుకోకపోయినా.. రాయబరేలీ కూడా పరిశీలనలో ఉందని వారు వాయనాడ్ ప్రజలకు ముందే చెప్పాల్సింది. ఆయన రెండు స్థానాల్లో గెలిస్తే.. ఒక సీటును వదులుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆ నియోజకవర్గంలోని ప్రజలకు అన్యాయం జరుగుతుంది. వారు ఎల్లప్పుడూ వాయనాడ్‌ను తేలిగ్గా తీసుకుంటున్నార”ని అన్నీ రాజా వ్యాఖ్యానించారు.

కాగా, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అమేథిలో ఓడిపోగా, వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ గెలుపొందారు. ఏప్రిల్ 26నే వాయనాడ్ పోలింగ్ ముగియడంతో.. రాయబరేలీ నుంచి కూడా రాహల్ పోటీకి దిగుతారని ఊహాగానాలు మొదలయ్యాయి. నామినేషన్ల దాఖలు గడువుకు ముందురోజు రాయబరేలీ అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరును కాంగ్రెస్ ప్రకటించింది. చివరి రోజున ఆయన నామినేషన్ వేశారు. ఈ నేపథ్యంలోనే అన్నీ రాజా స్పందించారు.

ఎన్నికలు అయ్యాక నిర్ణయం: కాంగ్రెస్
కాగా, గత ఎన్నికల్లో రాయబరేలీ నుంచి సోనియా గాంధీ లోక్‌స‌భ‌కు ఎన్నికయ్యారు. ఆరోగ్య కారణాలతో ఈసారి ఎన్నికలకు ఆమె దూరంగా ఉన్నారు. దీంతో ఇక్కడి నుంచి రాహుల్ గాంధీని పోటీకి దించింది కాంగ్రెస్. రెండు స్థానాల్లో గెలిస్తే వాయనాడ్‌ను వదులుకుంటారని జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్యం ఠాగూర్ స్పందించారు. ఎన్నికల ముగిసిన తర్వాత పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రెండు స్థానాల్లోనూ రాహుల్ గాంధీ గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

Also Read: రాయ్‌బరేలీలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌ గాంధీకి చేదు అనుభవం

ఓడిపోతారన్న భయంతోనే..: బీజేపీ
రాహుల్ గాంధీ రెండు స్థానాల్లో పోటీ చేస్తుండడంపై బీజేపీ వ్యంగ్యంగా స్పందించింది. వాయనాడ్‌లో ఓడిపోతారన్న భయంతోనే రాయబరేలీలో పోటీ చేస్తున్నారని బీజేపీ నేత మజీందర్ సింగ్ సిర్సా ఎద్దేవా చేశారు. వాయనాడ్‌ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని, ఏడు దశాబ్దాలుగా దేశాన్ని గాంధీ ఫ్యామిలీ చీట్ చేస్తూనే ఉందని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. అవకాశవాద రాజకీయాలు చేయడంలో కాంగ్రెస్ ముందుందని విమర్శించారు.

Also Read: కిషోరి లాల్ శర్మ ఎవరు? అమేథీ కాంగ్రెస్ అభ్యర్థిగా అధిష్టానం ఇతన్నే ఎందుకు ఎంపిక చేసింది..