అయోధ్య రామ మందిరం నిర్మాణ తేదీలు

అయోధ్య రామ మందిరం నిర్మాణానికి చురుగ్గా సన్నాహాలు జరుగుతున్నాయి. నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా నిర్మాణానికి సంబంధించిన తేదీలను ప్రకటించారు. మార్చి 25వ తేదీ నుంచి ఏప్రిల్ 02వ తేదీలోగా నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. నిర్మాణ కమిటీలో 11 మందిలో విశ్వహిందూ పరిషత్ నేతలతో పాటు పలు సంస్థల ప్రతినిధులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే..రామ మందిరం నిర్మాణం కోసం పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో నిర్మాణం చేపట్టాలని భావించిన సంగతి తెలిసిందే. భారతదేశంలోని పలు ప్రాంతాల నుంచి విరాళాలు సేకరించనున్నారు. ఇందుకు ప్రత్యేకంగా బ్యాంకు అకౌంట్ ఏర్పాటు చేస్తారని సమాచారం. సినీ ప్రముఖులు కూడా ఇందులో భాగస్వామ్యం అవుతారని తెలుస్తోంది.
2019, నవంబర్ 09వ తేదీ సుప్రీం తీర్పు
2019, నవంబర్ 09వ తేదీ శనివారం అయోధ్య కేసుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. రామ మందిరానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏకగ్రీవంగా తీర్పును సర్వన్నోత న్యాయస్థానం వెల్లడించింది. వివాదాస్పద స్థలంలో రామ మందిరం నిర్మాణానికి కోర్టు అనుమతినిచ్చింది. మూడు నెలల్లో అయోధ్య ట్రస్టును కేంద్రం ఏర్పాటు చేయాలని, 2.77 ఎకరాల భూమిని అయోధ్య ట్రస్టుకు వెంటనే అప్పగించాలని, మసీదు నిర్మాణం కోసం వేరే స్థలాన్ని కేటాయించాలని ఆదేశించింది. 5 ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని సూచించింది. కేటాయించే బాధ్యత అయోధ్య ట్రస్టుదేనని వెల్లడించింది.
134 సంవత్సరాలుగా వివాదంలో ఉన్న రామజన్మభూమి – బాబ్రీ మసీదు భూమి. దేశంలోని కోట్లాది మంది హిందువులు, ముస్లింల మనోభావాలతో ముడిపడిన కేసు ఇది. బాబ్రీ మసీదును ఖాళీ స్థలంలో కట్టలేదని పురావస్తు శాఖ తేల్చింది. అక్కడ గతంలో ఓ పెద్ద కట్టడం ఉండేదని పురావస్తు శాఖ చెప్పింది. లోపల ఉన్న నిర్మాణం దేవాలయం అని కచ్చితంగా పురావస్తు శాఖ చెప్పలేదు.
రాముడు అయోధ్యలో జన్మించాడనడంపై ఎలాంటి సందేహం లేదు. దేవాలయ విధ్వంసంపై స్పష్టమైన ఆధారాలు లేవు. హిందువుల విశ్వాసం తప్పు అని చెప్పేందుకు ఎలాంటి ఆధారం లేదు. వరండాలో హిందువులు పూజలు చేసినట్లు ఆధారాలున్నాయి. నమాజ్ కూడా చేసినట్లు ఆధారాలున్నాయి. 1856కు ముందు నమాజ్ చేసినట్లు ఆధారాలు లేవు. స్థలం హక్కులు చట్టబద్ధంగా ఉండాలి’ అని వెల్లడించింది.
Read More : పెళ్లి చేసుకున్నాడు..కానీ అంతలోనే షాక్