అమ్మాయిని కాబట్టే ఇంత స్పందన..1200 కి.మీటర్ల సైకిల్ జ్యోతి

లాక్ డౌన్ కష్టాలతో గాయపడిన తండ్రిని సైకిల్ మీద కూర్చోపోట్టుకుని 1200ల కిలోమీటర్ల పాటు సైకిల్ తొక్కుకుంటూ సొంత ఊరికి చేర్చిన 15 ఏళ్ల జ్యోతి ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. దేశ వ్యాప్తంగానే కాదు దేశం సరిహద్దులు దాటిపోయింది జ్యోతి కష్టం.
జ్యోతి కష్టాన్ని భారత సైక్లింగ్ సమాఖ్య కూడా ఆమె ప్రతిభను గుర్తించింది. వారు ఆమెకు ట్రైనింగ్ ఇవ్వటానికి ముందుకొచ్చింది. ఏకంగా అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్ దృష్టిని కూడా ఆకర్షించింది. జ్యోతి గురించి ఇవాంకా తన ట్విట్టర్ లో స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు. ప్రముఖ మ్యాథమెటీషియన్, సూపర్ 30 వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ జ్యోతి కుమారికి ఉచితంగా ఐఐటీ-జేఈఈ కోచింగ్ అందిస్తామని ప్రకటించాడు. ఇలా వెల్లువలా వస్తున్న ప్రశంసలతో..ప్రతీరోజు పెద్ద సంఖ్యలో పలువురు వస్తూన్న వారితో బీహార్ లోని జ్యోతి చిన్నపాటి ఇల్లు సందడి సందడిగా మారిపోయింది. వారి చిన్న ఇంటికి ఇప్పుడు 40 నుంచి 50 మంది వస్తున్నారు.
రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు,ప్రభుత్వ అధికారులు.. ఇలా అందరూ జ్యోతి జీవితం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు. దీంతో వచ్చేపోయేవారితో జ్యోతికి తినటానికి కూడా సమయం దొరకట్లేదు. అంతగా బిజీ అయిపోయింది జ్యోతి.
ఈ సందర్భంగా జ్యోతి బుధవారం (మే 27,2020) మాట్లాడుతూ..నేను అమ్మాయిని కాబట్టే ప్రజల నుంచి ఇంత స్పందన వచ్చిందని..కానీ కష్టంలో ఉండి దాన్ని తలచుకుంటూ బాధపడుతు కూర్చునే కంటే ఏదోక యత్నం చేయటం మంచిదనీ.. తన తల్లికి ఇచ్చిన మాట కోసం తన తండ్రిని అంత దూరం తీసుకొచ్చానని చెప్పింది. లాక్ డౌన్ తో ఎంతోమంది తనలాంటివారి పరిస్థితి ఇలాగే ఉందనీ..తండ్రిని సురక్షితంగా సొంత ఊరికి చేరుస్తానని తల్లికి మాట ఇచ్చానని అందుకే కష్టమైనా సరే తల్లికి ఇచ్చిన మాట నెరవేర్చానని చెప్పింది. జ్యోతి వారి ఇంటికి చేరుకన్నప్పటినుంచి బిజీ బిజీగా మారిపోయింది.
దీంతో జ్యోతి ఇల్లు వచ్చేపోయేవారితో సందడిగా మారిపోయింది.జ్యోతికి లడ్డూలు తినిపించేందుకు, శాలువాలు కప్పేందుకు, బట్టలు ఇచ్చేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు చాలామంది వస్తున్నారు.
ఉదయం ఏడు నుంచే జ్యోతి ఇంటికి జనాలు వస్తున్నారు. రాత్రి ఎనిమిది వరకు ఇలా అతిథులతోనే ఆమె ఇల్లు నిండిపోతోంది. భగభగ మంటున్న ఎండ వేడికి తట్టుకోలేక పాసవాన్ ఓ కొత్త ఫ్యాన్ కూడా కొన్నారు.
“మా ఇల్లు చాలా చిన్నది. అందుకే పక్కనే చిన్న టెంట్ వేస్తున్నాం. కరోనావైరస్ సోకుతుందేమోననే భయం కూడా ఉంది. అయితే ఎవరినైనా రావొద్దని అంటే.. గర్వం బాగా పెరిగిపోయిందని అనుకుంటారు. అందుకే పక్కనే ఓ టెంట్ వేస్తున్నాం. అక్కడకు అందరూ వచ్చి మా అమ్మాయిని ఆశీర్వదించొచ్చు అంటున్నాడు జ్యోతి తండ్రి మోహన్ పాసవాన్.
మా అమ్మాయి నిద్ర సరిగా పోవట్లేదు. తిండి కూడా సమయానికి తినలేకపోతోంది. అయినా కూడా విసుక్కోవడం లేదు. అందరినీ సంతోషంగానే పలకరిస్తోంది” అని జ్యోతి తల్లి ఫూలో అంటోంది. లాక్ డౌన్ తో జ్యోతి పెద్ద సెలబ్రిటీగా మారిపోయింది.