తిరుపతిలో కరోనా వైరస్: కేంద్రం కీలక నిర్ణయం

ప్రపంచవ్యాప్తంగా వణుకు పుట్టిస్తున్న కరోనా వైరస్ ప్రభావం భారత్‌లో మాత్రం తక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటివరకు అనుమానిత కేసులు కూడా నమోదు కాలేదు. అయితే తిరుపతిలోని ప్రభుత్వ రుయా ఆసుపత్రిలో కరోనా వైరస్ లక్షణాలతో ఒక రోగి చికిత్స చేయించుకునేందుకు చేరడం కలకలం సృష్టించింది. చైనాకు చెందిన ఒక టెక్నీషియన్ బంగారుపాళ్యెం దగ్గరున్న ఒక ప్రైవేటు ఫ్యాక్టరీలో మరమ్మత్తులు చేసేందుకు ఇండియాకు వచ్చాడ
అయితే ఆ వ్యక్తికి రెండు రోజులుగా తీవ్ర జలుబు, దగ్గు ఉంది. అతను రుయా ఆసుపత్రిలో చేరగా.. యువకుడికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. రక్తనమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీకి పంపారు. రెండురోజుల్లో అతనికి కరోనా ఉందా? లేదా? అనే విషయం డాక్టర్లు తేల్చనున్నారు.
ఈ క్రమంలోనే కరోనా వైరస్ విషయంలో భారత్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే చైనా నుంచి రాకపోకలు ఆపేసి, పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్న కేంద్రం.. ఇరాన్ పౌరులకు భారత్ వీసాలు నిలిపివేశారు. చైనాతోపాటు దక్షిణ కొరియా, పాకిస్తాన్, ఇరాన్ దేశాల్లో కరోనా వైరస్ కేసులు నమోదవగా.. కరోనా వైరస్ బారినపడిన దేశాల్లో ఇరాన్ రెండవ స్థానంలో ఉంది.
చైనాలోని వుహాన్ ప్రావిన్స్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎందరికో సోకి నిద్ర లేకుండా చేస్తున్న ఈ కోవిడ్19(కరోనా వైరస్) కారణంగా ఇప్పటికే 2800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 83,000 మందికి కరోనా వైరస్ సోకినట్లు లెక్కలు చెబుతున్నాయి. కరోనా వైరస్ భయంతో ప్రపంచదేశాలు వణికిపోతుండగా.. దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థ మీద కూడా పడింది.