కోవాగ్జిన్ 81శాతం ఎఫెక్టివ్..యూకే స్ట్రెయిన్ పైనా పనిచేస్తోంది : ఫేజ్-3 క్లినికల్ ట్రయిల్స్ ఫలితాలు విడుదల చేసిన భారత్ బయోటెక్

Covaxin కరోనా కట్టడి కోసం భారత్ బయోటెక్ సంస్థ అభివృద్థి చేసిన “కోవాగ్జిన్”మూడో దశ క్లినికల్ ట్రయిల్స్ ఫలితాలను ఆ సంస్థ బుధవారం విడుదల చేసింది. రెండవ డోస్ తర్వాత ముందస్తు ఇన్ఫెక్షన్ లేనివారిలో COVID-19 ను నివారించడంలో 81 శాతం మధ్యంతర సామర్థ్యం కలిగి ఉందని భారత్ బయోటెక్ తెలిపింది.
తీవ్రమైన, సీరియస్ మరియు వైద్యపరంగా ఎదురైన ప్రతికూల సంఘటనలు తక్కువ స్థాయిలో సంభవించాయని మరియు వ్యాక్సిన్ మరియు ప్లేసిబో గ్రూప్స్ మధ్య సమతుల్యతను కలిగి ఉన్నాయని కూడా మధ్యంతర విశ్లేషణలో తేలిందని భారత్ బయోటెక్ తెలిపింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుండి వచ్చిన విశ్లేషణ ప్రకారం.. వ్యాక్సిన్-ప్రేరిత యాంటీబాడీలు UK వేరియంట్ స్ట్రెయిన్స్ మరియు ఇతర వైవిధ్య జాతులను నూట్రలైజ్(తటస్తం లేదా అడ్డుకోవడం) చేయగలవని సూచిస్తుందని కంపెనీ తెలిపింది.
మూడవ దశ డేటా… 25,800 మంది పాల్గొన్న ట్రయల్ నుండి రూపొందించబడిందని భారత్ బయోటెక్ తెలిపింది. మరింత డేటాను సేకరించడానికి మరియు టీకా యొక్క సామర్థ్యాన్ని అంచనా వేయడానికి 130 ధృవీకరించబడిన కేసుల యొక్క తుది విశ్లేషణకు ట్రయల్స్ కొనసాగుతాయని కంపెనీ తెలిపింది.
మరోవైపు, దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్ ప్రారంభమైన మొదటి రోజు(మార్చి-1,2021)ప్రధానమంత్రి నరేంద్రమోడీ కోవాగ్జిన్ తొలి డోసు తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, దేశంలో అత్యవసర వినియోగానికి ఫూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేసిన కోవిషీల్డ్, హైదరాబాద్ కి చెందిన భారత్ బయోటెక్ సంస్థ.. భారత వైద్య పరిశోధనా సంస్థ(ఐసీఎంఆర్), నేషనల్ వైరాలజీ ఇన్స్టిట్యూట్(ఎన్ఐవీ)తో కలిసి అభివృద్ధి చేసిన “కోవాగ్జిన్” వ్యాక్సిన్ కు ఈ ఏడాది జనవరిలో డీజీసీఐ అనుమతి లభించిన విషయం తెలిసిందే.
కొవిషీల్డ్ భారత్‌లో తయారైనా.. విదేశీ సంస్థలు దాని అభివృద్ధిలో భాగమయ్యాయి. కానీ, కొవాగ్జిన్ పూర్తిస్థాయి స్వదేశీ టీకా. అందులోనూ భారత ప్రభుత్వానికి చెందిన సంస్థలు కొవాగ్జిన్ తయారీలో పాల్గొన్నాయి.ఇక,రెండో డోస్ తర్వాత కోవిషీల్డ్ సామర్థ్యం రేటు 70శాతంగా ఉండగా.. రెండో డోస్ తర్వాత కోవాగ్జిన్ సామర్థ్యం రేటు 81శాతంగా ఉన్నట్లు ఇవాళ విడుదలైన క్లినికల్ ట్రయిల్స్ ఫలితాలు చెబుతున్నాయి. అయితే, కొవాగ్జిన్ టీకాపై మొదట్లో చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. మూడో దశ ప్రయోగ ఫలితాలు వెలువడక ముందే కొవాగ్జిన్‌కు అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చారని విమర్శలు కూడా వచ్చిన విషయం తెలిసిందే.