Covid testing : నెగెటివ్‌ వచ్చినా..మరోసారి టెస్టు చేయించుకుంటే మంచిది

Covid testing : నెగెటివ్‌ వచ్చినా..మరోసారి టెస్టు చేయించుకుంటే మంచిది

Covid Testing One More

Updated On : April 20, 2021 / 4:42 PM IST

covid 19 experts say use ct scans x rays avoid false negative : కరోనా లక్షణాలు వస్తే వెంటనే టెస్ట్ లు చేయించుకోవటం చాలా మంచిది. అలా చేయించుకున్నాక టెస్ట్ రిపోర్టు నెగిటివ్ అని తేలితే ఎంతో సంతోషం కలుగుతుంది. హమ్మయ్యా..నెగిటివ్ వచ్చింది అని హ్యాపీగా..రిలాక్స్ గా ఫీల్ అవుతాం. కానీ ఆ రిపోర్టు ఎంత వరకూ నిజం అనేదానిపై సందేహాలొస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో తప్పుడు రిపోర్టులు వచ్చి సందర్భాలు లేకపోలేదు. అందుకనే నెగిటివ్ వచ్చింది కదాని రిలాక్స్ అయిపోకుండా మరోసారి టెస్ట్ చేయించుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకటికి రెండు సార్లు చేయించుకుంటే మరీ మరీ మంచిదని అంటున్నారు.

కాగా..కరోనా లక్షణాలున్న వారికి నిజంగా వైరస్‌ సోకిందో లేదో తెలుసుకోవడానికి సాధారణంగా ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్టులు చేస్తున్నారు. అయితే, ఈ టెస్టుల్లో కొన్నిసార్లు తప్పుడు ఫలితాలు వస్తున్నాయని నిపుణులే చెబుతున్నారు. కరోనా సోకినప్పటికీ రిపోర్టులో మాత్రం నెగటివ్‌ అని చూపుతోందని..ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షల్లో 80 శాతం సరైన ఫలితమే వస్తోంది. మిగతా 20 శాతం తప్పుడు ఫలితం రావడం ఆందోళనకరంగానే ఉంటున్నాయి. కరోనా బారినపడినప్పటికీ నెగటివ్‌ అని వస్తే సదరు బాధితులు చికిత్సకు దూరంగా ఉండే అవకావం ఉంది. అది ప్రమాదానికి దారి తీయవచ్చు. అది కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా కూడా మారొచ్చు. కాబట్టి కరోనా లక్షణాలు కొనసాగుతుండగా ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్టులో నెగటివ్‌ వస్తే 24 గంటల తర్వాత మరోసారి అదే టెస్టు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

రెండోసారి కూడా నెగటివ్‌ వస్తే సీటీ స్కాన్‌/చెస్ట్‌ ఎక్స్‌–రేలు కూడా తప్పనిసరిగా చేయించుకోవాలని అలా చేయటం మంచిదేనని చెబుతున్నారు. కరోనా సోకినప్పటికీ ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలో నెగెటివ్‌గా రావడానికి పలు కారణాలున్నాయని చెబుతున్నారు నిపుణులు. దీనికి కారణం..కరోనా టెస్టులు చేయించుకునే వ్యక్తి నుంచి నమూనాను(శాంపిల్‌) సేకరించే విషయంలో సక్రమంగా లేకపోవటం కూడా కావచ్చు. అందులో వైరల్‌ లోడ్‌ తక్కువగా ఉండగానే త్వరగా పరీక్ష చేయడం వల్ల ఇలా జరిగే అవకాశం ఉందంటున్నారు.

అమెరికా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వేరియంట్‌లను కూడా ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్టుల్లో గుర్తించగలుగుతున్నామని ఐసీఎంఆర్‌ ప్రతినిధి డాక్టర్‌ సమీరన్‌ పాండా చెప్పారు. ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులో 40 శాతం ఫలితమే తెలుస్తుందని సీనియర్‌ డాక్టర్‌ తెలిపారు. కాబట్టి కరోనా టెస్ట్ చేయించుకుని నెగిటివ్ అని వస్తే రిలాక్స్ అయిపోకుండా మరోసారి చేయించుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.