Nishikant Dubey: సుప్రీంకోర్టు, సీజేఐపై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు.. క్రిమినల్ కోర్టు ధిక్కార చర్యలకు అనుమతి కోరుతూ అటార్నీ జనరల్‌కు లేఖ

ఎటువంటి ఆధారం లేకుండా ఇటువంటి వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ సమగ్రత, స్వాతంత్ర్యంపై తీవ్ర దాడిగా పరిగణించబడుతున్నాయని..

Nishikant Dubey: రాష్ట్రపతికి బిల్లుల ఆమోదంపై గడువు విధించడం, వక్ఫ్‌ సవరణ చట్టంపై విచారణ నేపథ్యంలో సుప్రీంకోర్టుపై బీజేపీ జార్ఖండ్‌ ఎంపీ నిశికాంత్‌ దూబే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దేశంలో మత యుద్ధాలు రేగితే అందుకు సుప్రీంకోర్టు బాధ్యత వహించాల్సి ఉంటుందని.. దేశంలో అన్ని అంతర్యుద్ధాలకు సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా బాధ్యుడని ఆయన వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తన పరిధి దాటి వ్యవహరిస్తోందన్నారు. సుప్రీంకోర్టు, సీజేఐని ఉద్దేశించి బీజేపీ ఎంపీ దూబే చేసిన వ్యాఖ్యలపై రచ్చ రచ్చ జరుగుతోంది.

సుప్రీంకోర్టు, భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నాపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎంపీ నిషికాంత్ దూబేపై క్రిమినల్ కోర్టు ధిక్కార చర్యలు ప్రారంభించడానికి అనుమతి కోరుతూ భారత అటార్నీ జనరల్‌కు లేఖ పంపబడింది.

”సుప్రీంకోర్టు దేశాన్ని అరాచకం వైపు తీసుకెళ్తోంది. దేశంలో అంతర్యుద్ధాలకు భారత ప్రధాన న్యాయమూర్తి బాధ్యత వహించాలి” అని దూబే అన్నట్లు అడ్వకేట్-ఆన్-రికార్డ్ పంపిన లేఖలో పేర్కొన్నారు. బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్లు చర్య తీసుకోవడానికి సుప్రీంకోర్టు గడువు నిర్ణయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లలో కోర్టు జోక్యం చేసుకున్న సందర్భంలో దూబే మతతత్వ ద్వంద్వ ప్రకటనలు చేశారని కూడా ఆరోపణలు వచ్చాయి.

Also Read: వారెవ్వా.. అంతరిక్ష కేంద్రానికి నీటి ఎలుగును పంపనున్న ఇస్రో.. ఎందుకంటే?

కోర్టు ధిక్కార చట్టంలోని సెక్షన్ 15(1)(b) కింద AG వెంకటరమణి ముందు పిటిషన్ దాఖలు చేసిన AoR, దూబే వ్యాఖ్యలు “తీవ్ర అవమానకరమైనవి” “ప్రమాదకరమైన, రెచ్చగొట్టేవి” అని సమర్పించారు. “అతను గౌరవనీయులైన భారత ప్రధాన న్యాయమూర్తికి జాతీయ అశాంతిని నిర్లక్ష్యంగా ఆపాదించాడు. తద్వారా దేశంలోని అత్యున్నత న్యాయ కార్యాలయాన్ని అపకీర్తి పాలు చేశాడు. ప్రజల అసమ్మతి, ఆగ్రహం, అశాంతిని రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడు” అని లేఖలో పేర్కొన్నారు.

ఎటువంటి ఆధారం లేకుండా ఇటువంటి వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ సమగ్రత, స్వాతంత్ర్యంపై తీవ్ర దాడిగా పరిగణించబడుతున్నాయని, ఉద్దేశపూర్వకంగా కోర్టును కించపరిచే ప్రయత్నంపై క్రిమినల్ ధిక్కార చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

దూబే వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం కావడంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. అవి పార్టీ అభిప్రాయాలు కాదని, ఎంపీ వ్యక్తిగత ప్రకటనలని తేల్చి చెప్పారు. బీజేపీ అలాంటి ప్రకటనలతో విభేదిస్తుందని నడ్డా స్పష్టం చేశారు.

Also Read: డేంజర్ బెల్స్.. అన్నంలో ఆర్సెనిక్..! ప్రాణాంతకమైన ఈ విషపదార్ధం బియ్యంలోకి ఎలా వస్తోంది? దీనికి పరిష్కారం ఏంటి?

అసలు బీజేపీ ఎంపీ ఏమన్నారంటే..
‘‘ఎవరైనా ప్రతిదానికి సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తే, సుప్రీంకోర్టే చట్టాలు చేసేట్టు అయితే ఇక పార్లమెంటు ఎందుకు? అలాంటప్పుడు పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీను మూసేయాలి. సుప్రీం చీఫ్‌ జస్టిస్ ను రాష్ట్రపతి నియమిస్తారు, అలాంటి రాష్ట్రపతికి ఎలా ఆదేశాలు ఇస్తారు? దేశానికి సంబంధించిన అన్ని చట్టాలను చేసే పార్లమెంటును కోర్టు ఎలా నిర్దేశిస్తుంది. రాష్ట్రపతికి మూడు నెలల గడువు విధించాలని ఏ చట్టంలో ఉంది. సుప్రీంకోర్టు దేశాన్ని అరాచకత్వం వైపు నడిపించాలని చూస్తోంది. పార్లమెంటు సమావేశాలు జరిగినప్పుడు ఈ అంశంపై విస్తృతంగా చర్చిస్తాం” అని ఎంపీ దూబే చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశంలో దుమారం రేపుతున్నాయి.

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here