Arsenic In Rice: డేంజర్ బెల్స్.. అన్నంలో ఆర్సెనిక్..! ప్రాణాంతకమైన ఈ విషపదార్ధం బియ్యంలోకి ఎలా వస్తోంది? దీనికి పరిష్కారం ఏంటి?

ఇది క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహానికి కారణమవుతుందని వివరించారు.

Arsenic In Rice: డేంజర్ బెల్స్.. అన్నంలో ఆర్సెనిక్..! ప్రాణాంతకమైన ఈ విషపదార్ధం బియ్యంలోకి ఎలా వస్తోంది? దీనికి పరిష్కారం ఏంటి?

Updated On : April 19, 2025 / 10:09 PM IST

Arsenic In Rice: బియ్యం.. మనిషి ప్రాణాలకు ముప్పుగా మారుతోందా? బియ్యంలో ప్రాణాంతకమైన రసాయనం ఆర్సెనిక్ శాతం పెరుగుతోందా? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. వాతావరణ మార్పులు ఈ ఆహారాన్ని మరింత ప్రమాదకరంగా మారుస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. భూమి వేడెక్కడం, కర్బన ఉద్గారాలు పెరిగే కొద్దీ బియ్యంలో ఆర్సెనిక్ పరిమాణం కూడా పెరగొచ్చన్నారు. ఆర్సెనిక్ అనేది దాదాపు అన్ని రకాల బియ్యంలో కనిపించే హానికరమైన కెమికల్. పొలంలోని నేల నుంచి ఇది వరిలోకి వస్తుంది.

కొన్ని రకాల బియ్యంలో చాలా తక్కువ మొత్తంలో ఆర్సెనిక్ ఉంటుంది, మరికొన్నింటిలో ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఆరోగ్య నిపుణులు సురక్షితమైనదని చెప్పే దానికంటే ఎక్కువ మోతాదులో ఆర్సెనిక్ బియ్యంలో కనిపిస్తుంది. ఆర్సెనిక్ తక్కువ మొత్తంలో ఎక్కువ కాలం తిన్నా హానికరం కావచ్చు. ఇది క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహానికి కారణమవుతుందని వివరించారు.

ఆర్సెనిక్.. ఓ విషపదార్ధం. దీనికి రుచి, రంగు, వాసన ఉండవు. ఈ లక్షణాలే రోమన్ కాలంలో, మధ్య యుగాల నాటి యూరప్‌లో శత్రువులను నిర్మూలించడానికి ఆర్సెనిక్‌ను ఉపయోగించడానికి కారణమయ్యాయని చరిత్ర చెబుతోంది. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయి, ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు బియ్యంలో ఆర్సెనిక్ పరిమాణం కూడా పెరుగుతుందట. క్యాన్సర్‌కు ఇన్ ఆర్గానిక్ ఆర్సెనిక్ కారణమవుతుందని, ఊపిరితిత్తులు, గుండెకు హాని కలిగిస్తుందని అనేక పరిశోధనల్లో తేలింది.

ఇన్ ఆర్గానిక్ ఆర్సెనిక్ సహజంగా రాళ్లు, నేలలో కనిపిస్తుంది. మైనింగ్, బొగ్గును కాల్చడం, ఇతర పారిశ్రామిక పనుల వంటి మానవ కార్యకలాపాల నుంచి కూడా రావొచ్చు. తాగునీటితో పాటు ఆహారం ద్వారా ప్రజలు ఆర్సెనిక్‌కు గురయ్యే అతిపెద్ద మార్గం బియ్యం తినడం. భూగర్భ జలాల్లో తక్కువ ఆర్సెనిక్ స్థాయిలుండే యూరప్ వంటి ప్రదేశాలలోనూ బియ్యం రూపంలో వారి శరీరంలోకి అత్యధికంగా ఇన్ ఆర్గానిక్ ఆర్సెనిక్‌ చేరుతోంది.

”పొలాలను వరద ముంచెత్తితే నేల నుంచి ఆక్సిజన్ తొలగిపోతుంది. దీంతో నేలలోని కొన్ని బ్యాక్టీరియాలు జీవించడానికి ఆక్సిజన్‌కు బదులుగా ఆర్సెనిక్‌ను వినియోగించుకుంటాయి. ఈ బ్యాక్టీరియా రసాయన మార్పులను కలిగిస్తుంది. వరి మొక్కలను వాటి వేర్లు ద్వారా ఆర్సెనిక్‌ను సులభంగా తీసుకునేలా చేస్తుంది. నేలలో ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు, ఆర్సెనిక్ మరింత చురుగ్గా మారుతుంది. ఈ మార్పు నేలలోని సూక్ష్మజీవులని కూడా ప్రభావితం చేస్తుంది. ఆర్సెనిక్‌ను ఇష్టపడే బ్యాక్టీరియా వృద్ధికి సాయపడుతుంది” అని పరిశోధకులు తెలిపారు.

”ఆర్సెనిక్ బలమైన క్యాన్సర్ కారకం. చర్మం, ఊపిరితిత్తులు, మూత్రాశయ క్యాన్సర్‌ల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇన్ ఆర్గానికి ఆర్సెనిక్ క్యాన్సర్‌తో పాటు గుండె జబ్బులు, మధుమేహం ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. గర్భిణులు ఎక్కువ ఆర్సెనిక్ తింటే బిడ్డ పుట్టక ముందే లేదా వెంటనే చనిపోయే ప్రమాదం ఉంటుంది. శిశువు తక్కువ బరువుతో పుట్టడానికి కారణమవుతుంది.

60 కిలోల బరువున్న వ్యక్తి రోజుకు 7.8 మైక్రోగ్రాముల ఇన్ ఆర్గానికి ఆర్సెనిక్ తింటే వారికి మూత్రాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం దాదాపు 3 శాతం పెరుగుతుంది. మధుమేహం వచ్చే ప్రమాదం దాదాపు ఒక శాతం పెరుగుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే భవిష్యత్తులో బియ్యం తినే జనాభాకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలొస్తాయి” అని తాజా అధ్యయనంలో తేలింది.

వరి పొలాల్లో ఆర్సెనిక్ స్థాయిలను తగ్గించడానికి శాస్త్రవేత్తలు కొత్త మార్గాలను పరీక్షిస్తున్నారు. అందులో ఒక పద్ధతి ఏంటంటే.. పొలాన్ని పాక్షికంగా నీటితో ఉండేలా చూడాలి. నీరు తగ్గాక మళ్లీ నింపాలి. దానిని నిండుగా ఎప్పుడూ ఉంచొద్దు. ఇది ఇన్ ఆర్గానిక్ ఆర్సెనిక్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే, ఇందులో మరో సమస్య లేకపోలేదు. ఆ పద్ధతి కాడ్మియంను పెంచుతుంది. కాడ్మియం ఇంకా డేంజరస్. ఇది రొమ్ము, ఊపిరితిత్తులు, ప్రొస్టేట్, ప్యాంక్రియాటిక్, మూత్రపిండాల క్యాన్సర్ వంటి అనేక రకాల క్యాన్సర్‌లకు కారణమవుతుందట. కాలేయం, మూత్రపిండాల వ్యాధికి కూడా దారితీస్తుందట.

మరొక ఆలోచన ఏంటంటే నీటిలో సల్ఫర్‌ను కలపడం. ఎందుకంటే ఇది ఎలక్ట్రాన్‌లను గ్రహించడం ద్వారా ఆర్సెనిక్‌తో పోటీ పడగలదు. ప్రత్యేక ఎరువులను ఉపయోగించడం ద్వారా నేల బ్యాక్టీరియాను మార్చడం కూడా సాయపడొచ్చు. వరిలో ఆర్సెనిక్‌ను తగ్గించడానికి మరొక మార్గం ఏమిటంటే, వర్షపు నీటి ఆధారిత పరిస్థితుల్లో లేదా నేల, నీటిలో తక్కువ ఆర్సెనిక్ ఉన్న ప్రదేశాల్లో వరి పండించడం. మొత్తంగా.. బియ్యంలో ఆర్సెనిక్ తగ్గించాలంటే.. ఒక్కటే మార్గం ఉందట. అదే.. వరి పండించే విధానాన్ని మార్చుకోవడం అని శాస్త్రవేత్తలు తేల్చి చెబుతున్నారు.

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here