ఒడిశాలో ఫొని తుపాను బీభత్సం : 8 మంది మృతి

ఫొని తుపాను బీభత్సం సృష్టించింది. ఒడిశాను అతలాకుతలం చేసింది. విపత్తులను ఎదుర్కోవడంలో రాటుదేలిన ఒడిశా ప్రభుత్వం ముందస్తు చర్యలతో ప్రాణ నష్టం భారీగా నివారించగలిగినా ఆస్తి నష్టం మాత్రం తప్పలేదు. 200 కిలోమీటర్లకు పైగా వేగంతో వీచిన గాలులతో ఒడిశా చిగురుటాకులా వణికిపోయింది. తుఫాన్ బీభత్సానికి 8 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు.
గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో తీవ్ర పెనుతుపానుగా తీరంపై విరుచుకుపడిన ఫొని ధాటికి ఒడిశా విలవిల్లాడింది. ఫొని తుఫాన్ ధాటికి ఒడిశాలోని పలు ప్రాంతాలు కకావికలమయ్యాయి. నగరాలు కుదేలయ్యాయి. పూరీ వద్ద తీరం దాటిన ఫొని ధాటికి జనజీవనం స్తంభించిపోయింది. ప్రత్యేకించి రాజధాని భువనేశ్వర్, తుఫాన్ తీరాన్ని తాకిన పూరీ నగరాల్లో పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది.
శుక్రవారం ఉదయం పూరీకి దక్షిణంగా బలుగాం, రంభ సమీపంలో పెను తుఫాను తీరం దాటింది. తుఫాన్ తీరాన్ని దాటిన సమయంలో కుండపోత వాన, 200 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు భారీ వృక్షాలు సైతం నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు వేల సంఖ్యలో కూలిపోయాయి. సెల్‌ఫోన్ టవర్లు, భారీ క్రేన్లు సైతం పెనుగాలులకు చిగురుటాకుల్లా వణుకుతూ నేలకూలాయి. బస్సులు, కార్లు గాలికి కొట్టుకుపోయాయి.
అనేక చోట్ల గోడలు, ఇళ్లు కూలిపోయాయి. భువనేశ్వర్, ఖుర్దారోడ్, పూరీ రైల్వే స్టేషన్ల పైకప్పులు ఎగిరిపోయాయి. రాజధాని భువనేశ్వర్‌లోని బిజూపట్నాయిక్ అంతర్జాతీయ విమానాశ్రయానికీ ఫొని తుపాను తాకిడి తప్పలేదు. అక్కడా నష్టం జరిగింది. విమానాశ్రయం నుంచి అన్ని సర్వీసులనూ ఒక రోజు పాటు రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు రైళ్ల రాకపోకలపైనా తుఫాను ప్రభావం పడింది. అనేక రైళ్లను అధికారులు రద్దు చేశారు.
తుఫాన్ వీడినా.. భారీ వర్షాలు మాత్రం ఇంకా కురుస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు వెళ్లడించారు. భువనేశ్వర్, పూరీ, కటక్ సహా.. అనేక ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సుమారు 14 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో… ప్రాణా నష్టం తగ్గింది. పూరీలో ఎటు చూసినా ఫొని సృష్టించిన బీభత్సమే కనిపించింది.