భీకరంగా క్యార్ తుపాను : మూడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

క్యార్ తుపాన్ హఢలెత్తిస్తోంది. భీకరంగా మారుతోందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కర్ణాటక, గోవా, మహారాష్ట్రల్లో భారీ వర్షాలు పడుతాయని వెల్లడిస్తున్నారు. మహారాష్ట్రలోని రత్నగిరికి 190 కిలోమీటర్ల దూరాన అరేబియా సముద్రంలో ఏర్పడిన క్యార్ తుపాన్..భీకరరూపం దాల్చుతున్నట్లు భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న ఐదు రోజుల్లో ఇది ఒమన్ తీరంవైపు పయనించనుందని అక్టోబర్ 26వ తేదీ శనివారం వెల్లడించారు.
ఈ కారణంగా వచ్చే 24 గంటల్లో ఉత్తర, దక్షిణ గోవా జిల్లాలు, మహారాష్ట్రలోని రత్నగిరి, సింధూదుర్గ్, కర్ణాటకలోని తీర, ఉత్తర ప్రాంతాల్లో బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. తూర్పు మధ్య అరేబియన్ సముద్రంలో అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. క్యార్ తుపాన్ ప్రభావిత ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ముంబైకి కూడా నష్టం కలిగించే అవకాశం ఉందని అంచనా వేసింది.
సముద్రం అల్లకల్లోల్లంగా ఉంటుందని, అక్టోబర్ 29వ తేదీ వరకు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని సూచించారు అధికారులు. దక్షిణ గుజరాత్ తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. డాంగ్స్, తాపి, సూరత్, భారుచ్, వల్సాద్, నవసరి, అమ్రేలీ తదితర ప్రాంతాల్లో మంగళవారం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తుపాన్ నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఇండియన్ కోస్ట్ గార్డు పలు చర్యలు తీసుకుంది. పడవలు, హెలికాప్టర్లను సిద్ధం చేసింది.
Read More : డీకేకు బెంగుళూరులో ఘన స్వాగతం