రైతు నాయకులతో బహిరంగంగా చర్చించాలి… కేంద్రానికి కేజ్రీవాల్ సవాల్

రైతు నాయకులతో బహిరంగంగా చర్చించాలి… కేంద్రానికి కేజ్రీవాల్ సవాల్

Updated On : December 28, 2020 / 8:17 AM IST

Debate with farmers in public దేశ రాజధాని సరిహద్దుల్లో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నెల రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం(డిసెంబర్-27,2020) ఢిల్లీ సరిహద్దు సింఘులోని గురు తేజ్‌ బహదూర్ మెమోరియల్‌ను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో కలిసి సందర్శించిన అనంతరం రైతులు నిరసన చేస్తున్న సింఘు ప్రాంతాన్ని కేజ్రీవాల్ సందర్శించారు. రైతు సంఘాల నేతలను కలిసి వారితో మాట్లాడారు కేజ్రీవాల్.

ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ…వ్యవసాయ చట్టాల గురించి ఎక్కువగా తెలిసిన కేంద్ర ప్రభుత్వానికి చెందిన వారిని రైతు నాయకులతో బహిరంగంగా చర్చించాలని కేజ్రీవాల్ సవాలు చేశారు. దీంతో అగ్రి చట్టాల గురించి ఎవరికి ఎక్కువ తెలుసు, రైతులకు తగినంతగా తెలియదని రుజువు అవుతుందని కేజ్రీవాల్ అన్నారు. దేశ రాజధాని సరిహద్దుల్లో.. రైతులు తమ మనుగడ కోసం పోరాడుతున్నారని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం తక్షణమే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు. మన రైతులు గత 32 రోజులుగా చలి మధ్య వీధుల్లో ఎందుకు పడుకోవలసి వస్తున్నదని ప్రశ్నించారు. ఇక్కడ 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం తనకు చాలా బాధను కలిగించిందని చెప్పారు. రైతులు చెప్పేది విని వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నా అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

మరోవైపు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించే ప్రయత్నాలు చేయడానికి సీఎం కేజ్రీవాల్‌ 24 గంటలు కృషి చేస్తున్నారని డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా తెలిపారు. ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ స్టేడియంలను జైళ్లుగా మార్చలేదన్నారు. తాము అలా చేసి ఉంటే చరిత్రలో ఒక నల్లని మచ్చగా మిగిలిపోతామని వ్యాఖ్యానించారు.