Third Route To Ladakh : లడఖ్ కు కొత్త సొరంగ మార్గం నిర్మాణానికి రక్షణశాఖ అంగీకారం

పై లడఖ్‌కు అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రయాణించేందుకు అనువుగా మనాలీ- లేహ్ మార్గంలో ఓ సొరంగ మార్గం నిర్మాణానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.

Third Route To Ladakh : లడఖ్ కు కొత్త సొరంగ మార్గం నిర్మాణానికి రక్షణశాఖ అంగీకారం

Third Route To Ladakh

Updated On : May 19, 2021 / 8:11 PM IST

Third Route To Ladakh ఇకపై లడఖ్‌కు అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రయాణించేందుకు అనువుగా మనాలీ- లేహ్ మార్గంలో ఓ సొరంగ మార్గం నిర్మాణానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. షిన్‌కున్ లా పాస్ కింద 4.25 కిలోమీటర్ల మేర ఈ సొరంగాన్ని నిర్మిస్తారు. ఇది అందుబాటులోకి వస్తే అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ మనాలి నుంచి లేహ్ కు.. దార్చా-పడుమ్-నిమ్ము గుండా సులభంగా చేరుకోవచ్చు. మంచు బారిన పడకుండా లడఖ్ సెక్టార్ లోని భారత సైన్యానికి అవసరమైనవాటిని సరఫరా చేయడం దీంతో సులువవుతుంది. 2024నాటికి ఈ టన్నెల్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

కాగా,ఈ ఏడాది మార్చిలో..షిన్‌కున్ లా పాస్ క్రింద 13.5 కిలోమీటర్ల పొడవైన సొరంగాన్ని నిర్మించాలని నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(NHIDCL) ప్రతిపాదించింది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO) మాత్రం 4.25 కిలోమీటర్ల పొడవైన సొరంగాన్ని నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు. చివరికి బీఆర్ఓ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. దీని కోసం దాదాపు రూ.1,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా.

దార్చా-పడుమ్-నిమ్ము రోడ్డు పొడవు 297 కిలోమీటర్లు. దీనిలో 100 కిలోమీటర్ల మేరకు ఇప్పటికే డబుల్ లేన్ ఉంది. ఇది బ్లాక్ టాప్ రోడ్డు. కొత్త రోడ్డు నిర్మాణం వల్ల మనాలీ-లేహ్ మధ్య దూరంలో మార్పు ఉండదు. అయితే మంచు బారిన పడకుండా ఏడాది పొడవునా ప్రయాణించేందుకు వీలవుతుంది. లడఖ్, కార్గిల్, సియాచిన్ సెక్టర్లలో ఉండే భారత సైన్యానికి ఆహారం, ఆయుధాలు వంటివాటిని సరఫరా చేయడం సులువవుతుంది.

ప్రస్తుతం మనాలీ-సార్చు-ఉప్షి-లేహ్ రోడ్డును వినియోగిస్తున్నారు. ఈ రోడ్డు నాలుగు ఎత్తయిన పర్వత శ్రేణుల గుండా వెళ్తుంది. రోహ్‌తంగ్ పాస్ క్రింద అటల్ సొరంగాన్ని నిర్మించినప్పటికీ ఈ ఎత్తయిన కొండలపై నుంచి ప్రయాణించడం తప్పడం లేదు. శీతాకాలంలో సుమారు రెండు, మూడు నెలలపాటు మంచు విపరీతంగా కురుస్తూ ఉంటుంది.