ఢిల్లీ బాద్షా ఎవరు : బీజేపీకి పరాభవం తప్పదా ?

  • Published By: madhu ,Published On : February 10, 2020 / 06:53 PM IST
ఢిల్లీ బాద్షా ఎవరు : బీజేపీకి పరాభవం తప్పదా ?

Updated On : February 10, 2020 / 6:53 PM IST

ఢిల్లీ పీఠం దక్కేదెవరికి? కేజ్రీవాల్ తిరిగి సీఎం అవుతారా? బిజెపికి మరోసారి పరాభవం తప్పదా? లేదంటే మోదీ – అమిత్ షా మ్యాజిక్ ఏమైనా చేయగలరా? ఈ ప్రశ్నలకు సమాధానాలు మరికొన్ని గంటల్లో రాబోతున్నాయ్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కి అన్ని ఏర్పాట్లు పూర్తవ్వగా పార్టీల్లో టెన్షన్ ప్రారంభమైంది. ఈ సస్పెన్స్ కొన్ని గంటల్లోనే వీడనుంది.

మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్  ప్రారంభం కానుంది. మొత్తం 21 కౌంటింగ్ సెంటర్లను ఈసీ ఏర్పాటు చేయగా. మధ్యాహ్నం కల్లా ఫలితాల ట్రెండ్ తెలిసిపోనుంది. లోక్ సభ ఎన్నికల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఢిల్లీ నాలుగోది కాగా మహారాష్ట్ర, జార్ఖండ్ బిజెపికి షాక్ ఇవ్వగా..హర్యానాలో మాత్రమే అధికారం నిలబెట్టుకోగలిగింది. దీంతో ఢిల్లీ ఫలితం బిజెపికి ప్రతిష్టాత్మకంగా మారింది.

ఫిబ్రవరి 8న జరిగిన పోలింగ్ శాతం 2015నాటి అసెంబ్లీ పోలింగ్‌తో పోల్చుకుంటే ఐదున్నరశాతం వరకూ తగ్గింది. దీంతో తగ్గిన పోలింగ్ శాతం ఎవరి కొంప ముంచుతుందో అన్న భయాలు పార్టీలని వెంటాడుతున్నాయి. విడుదలైన అన్ని ఎగ్జిట్  పోల్స్..ఆమ్ ఆద్మీనే హ్యాట్రిక్ కొడుతుందని తేల్చేశాయ్. ఢిల్లీ ఎంపి మనోజ్ తివారీ మాత్రం కౌంటింగ్ రోజు సీన్ రివర్సవుతుందంటూ ధీమా వ్యక్తం చేశారు. తన మాట గుర్తుపెట్టుకోవాలని మరీ ట్వీట్ చేయడంతో..బిజెపికి ఓటర్లు ఏదైనా ఛాన్స్ ఇస్తారేమో అనే ఆశలు ఆ పార్టీలో కనిపిస్తున్నాయి. 

 

23 ఏళ్ల నుంచి ఢిల్లీ పీఠం దక్కకపోవడంతో.. బిజెపి ఈ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది..బోలెడన్ని  బహిరంగ సభలతో  ఊదరగొట్టింది. కేంద్ర మంత్రులతో సహా పార్టీ దిగ్గజాలందర్నీ ప్రచార బరిలోకి దింపింది. ప్రధాని మోదీ సైతం ఈ అసెంబ్లీ ఎన్నికలను సవాలుగా తీసుకున్నట్లు కన్పించింది. కేంద్ర పథకాలను అడ్డుకుంటున్నారంటూ నేరుగా కేజ్రీవాల్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ఆమ్ ఆద్మీ మాత్రం విద్య, వైద్యం, నిరంతర విద్యుత్, మంచినీటి సరఫరా హామీలతో పాటు సంక్షేమ పథకాల కొనసాగింపు హామీలతో దూసుకెళ్లింది. 

2015 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి ఇక్కడ 3 సీట్లు మాత్రమే వచ్చాయి. 67 సీట్లు సాధించిన ఆమ్ఆద్మీదే తిరిగి అధికారమంటూ ఎగ్జిట్ పోల్స్  ప్రకటించాయి. పోటీ బిజెపి – ఆమ్ఆద్మీ మధ్యనే ఉఁటుందనే అంచనాలకు కాంగ్రెస్ కొత్త రాగం కూడా బలం చేకూర్చుతోంది. ఆమ్ ఆద్మీ కోసం తాము త్యాగం చేసామంటూ ఆ పార్టీ నేత కేటిఎస్ తులసి చెప్పడం ఇందుకు నిదర్శనం. మరి అధికార పీఠంపై ఎవరు కూర్చొంటారో కొద్ది గంటల్లోనే తెలిసిపోనుంది.