Delhi Floods: యమునా నది వరద ఉధృతికి విరిగిపోయిన రెగ్యులేటర్.. భయం లేదన్న కేజ్రీవాల్
యమునా నదిలో నీరు క్రమంగా తగ్గుతోందని, త్వరలో ఢిల్లీ ప్రజలకు ఉపశమనం లభిస్తుందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ భరోసాయిచ్చారు.

delhi floods updates
Delhi Floods News: దేశ రాజధాని ఢిల్లీని వరదలు వణికిస్తున్నాయి. యమునా నది (Yamunal River) మహోగ్రరూపం దాల్చడంతో ఢిల్లీలోని చాలా ప్రాంతాలు మునిగిపోయాయి. వరద బాధిత ప్రాంతాల్లోని ప్రజలు కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఢిల్లీ ఐటీఓ ను యమునా వరద ముంచేసింది. ఐటిఓ వద్ద డ్రెయిన్ నెం.12 రెగ్యులేటర్ విరిగిపోయింది. ఢిల్లీ నుంచి వర్షపు నీటిని యమునా నదిలోకి తీసుకువెళ్లే రెగ్యులేటర్ విరిగిపోవడంతో ఐటీఓ నీట మునిగింది. యమునా నది వరద ఉధృతితో నిన్న సాయంత్రం డ్రెయిన్ రెగ్యులేటర్ విరిగిపోయింది.
శ్రమిస్తున్న ప్రభుత్వ సిబ్బంది
డ్రెయిన్ రెగ్యులేటర్ ను పునరుద్ధరించేందుకు జల్ బోర్డ్ ఇంజనీర్లు శ్రమిస్తున్నారు. మరోవైపు నగరంలోని వరద నీరు రాకుండా చేసేందుకు వందలాది మంది ఎన్డీఎంసీ కార్మికులు చర్యలు చేపట్టారు. ఇసుక బ్యాగులతో గోడ నిర్మిస్తూ వరదను కట్టిడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. డ్రెయిన్ రెగ్యులేటర్ పునరుద్ధరణ పనులు 60 శాతం పూర్తయినట్లు మంత్రి సౌరవ్ భరద్వాజ్ వెల్లడిండారు.
త్వరలో ప్రజలకు ఉపశమనం: కేజ్రీవాల్
ఐటీఓ వికాస్ భవన్ వద్ద డ్రెయిన్ రెగ్యులేటర్ దెబ్బతిన్న స్థలాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్జీ సక్సేనా, సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. యమునా నదిలో నీరు క్రమంగా తగ్గుతోందని, త్వరలో ఢిల్లీ ప్రజలకు ఉపశమనం లభిస్తుందని భరోసాయిచ్చారు. వివిధ కారణాల వల్ల వరద నీరు వివిధ ప్రాంతాలలోకి ప్రవేశించిందని, డ్రెయిన్ రెగ్యులేటర్ పనిచేయకపోవడంతో ఐటిఓ రాజ్ ఘాట్ వద్ద వరద నీరు చేరిందని తెలిపారు.
Also Read: ఫ్రాన్స్ నుంచి అమిత్ షాకు మోదీ ఫోన్… ఢిల్లీ వరదలపై ఆరా
వరదపై రాజకీయాలు వద్దు: నిత్యానంద రాయ్
ఢిల్లీ వరదలపై హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ స్పందించారు. ఢిల్లీ వరద పరిస్థితిపై రాజకీయాలు చేయడం కంటే ప్రతి ఒక్కరూ పరిస్థితిని చక్కదిదెందుకు కృషి చేయాలని కోరారు. అవసరాన్ని బట్టి NDRF బృందాలను పంపుతున్నామని, ఢిల్లీకి 15 NDRF బృందాలను తరలించినట్టు చెప్పారు. 4,346 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించామని, 179 జంతువులు కూడా రక్షించినట్టు వెల్లడించారు.
కేజ్రీవాల్ బాధ్యత తీసుకోరు: మీనాక్షి లేఖి
ఢిల్లీ వరదల పరిస్థితిపై కేంద్ర మంత్రి, న్యూఢిల్లీ ఎంపీ మీనాక్షి లేఖి మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రజల్లో నిస్సహాయ భావం ఉందని అన్నారు. వరదలను నియంత్రిచడంలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమయిందని విమర్శించారు. వరద నియంత్రణ శాఖకు వచ్చే భారీ బడ్జెట్ తో ఎటువంటి చర్యలు చేపట్టలేదని, వరద కట్టడికి కరకట్టలు కూడా నిర్మించలేదని ధ్వజమెత్తారు. సీఎం కేజ్రీవాల్ ఎంతసేపూ కేంద్రంపై నిందలు వేస్తూనే ఉంటారు కానీ ఎలాంటి బాధ్యత తీసుకోరని విమర్శించారు. పునరావాస కేంద్రాలుగా పాఠశాలలు ఉపయోగించాలని సూచించారు.