చలానా వేస్తే చచ్చిపోతా: ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించిన యువతి

  • Published By: veegamteam ,Published On : September 16, 2019 / 05:56 AM IST
చలానా వేస్తే చచ్చిపోతా: ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించిన యువతి

Updated On : September 16, 2019 / 5:56 AM IST

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే జరిమానాలు భారీగా విధిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. కొత్త మోటారు వాహనాల చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అందులో భాగంగా.. పలు వాహనాలకు వేసిన ఫైన్లు గుండెలు జారిపోయేలా చేశాయి. వెహికల్ తో బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు వాహనదారులు.

అన్ని పేపర్లు ఉన్నాయో లేదో అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని బయటకు రావలసిన పరిస్థితి కనిపిస్తుంది. అయినా సరే కొంతమంది బుక్ అయిపోతున్నారు. వేలకొద్దీ ఫైన్లు వేసిన ఘటనల గురించి విన్నాం. దీంతో ఫైన్ల నుంచి తప్పించుకోవటానికి ఎవరికి తోచినట్లు వాళ్లు ప్రవర్తిస్తున్నారు.

ఈ క్రమంలోనే కొందరైతే  ట్రాఫిక్ పోలీసులతో గొడవలకు దిగుతున్నారు. ఇంకొందరైతే ఏకంగా పోలీసులను బెదిరిస్తున్నారు. లేటెస్ట్ గా దేశ రాజధాని ఢిల్లీలో ఇటువవంటి ఘటనే చోటుచేసుకుంది. ట్రాఫిక్ నిబంధనల్ని పాటించని ఓ యువతిని పోలీసులు అడ్డగించారు.

దీంతో సదరు యువతి నడిరోడ్డుపై హల్‌చల్‌ చేసింది. ట్రాఫిక్‌ పోలీసులతో వాగ్వివాదానికి దిగటమే కాకుండా చలానా వేస్తే ఆత్మహత్య చేసుకుంటా అంటూ బెదిరింపులకు దిగింది. విరిగిపోయిన నెంబర్‌ ప్లేటు పెట్టుకుని రోడ్డుపై వెళుతున్న యువతిని ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా జరిమానా కట్టాలని ఆదేశించారు పోలీసులు.

పెద్ద మొత్తం జరిమానా కట్టాల్సి వస్తుందని భావించిన యువతి వెంటనే పోలీసులతో గొడవకు దిగింది. చలానా వేయకుండా తనని వదిలిపెట్టాలని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించింది. బైక్ కీ ని పోలీసులు తీసుకోగా 20నిమిషాల పాటు యువతి హల్‌చల్‌ చేసింది.

అయితే యువతి తీరుతో విసిగిపోయిన పోలీసులు చివరకు చలానా వేయకుండానే ఆమెను పంపేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా అవుతుంది. వీడియోలో ఫైన్ వేశారంటే జాగ్రత్త.. ఉరివేసుకుంటానంటూ హెచ్చరిస్తూ..తన హెల్మెట్‌ను నేలకేసి కొట్టింది యువతి. అయితే యువతి ఫోన్ లో మాట్లాడుతుంటే పట్టుకున్నాం అంటూ చెబుతున్నారు పోలీసులు.