Dhar road accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 15మంది దుర్మరణం.. 20మందికిపైగా తీవ్ర గాయాలు
Dhar road accident : మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిక్లియా క్రాసింగ్ వద్ద పెట్రోల్ పంప్ సమీపంలో జరిగిన ప్రమాదంలో 15మంది కూలీలు దుర్మరణం చెందారు.
Dhar road accident
- మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
- పికప్ వాహనం బోల్తా.. 15మంది మృతి
- దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం మోహన్ యాదవ్
Dhar road accident : మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిక్లియా క్రాసింగ్ వద్ద పెట్రోల్ పంప్ సమీపంలో జరిగిన ప్రమాదంలో 15మంది కూలీలు దుర్మరణం చెందారు. మరో 20మందికి గాయాలయ్యాయి. వీరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నాయి. అయితే, వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Also Read : Bengaluru Tragedy: వర్ష బీభత్సం.. ఆసుపత్రి గోడ కూలి ఏడుగురు మృతి.. బెంగళూరులో పెను విషాదం
బుధవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న పికప్ వాహనం కారును ఢీకొట్టి అదుపు తప్పి పల్టీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ క్రమంలో వ్యాన్‌లో ఉన్న 15మందికి తీవ్ర గాయాలు కావడంతో మరణించారు. మృతుల్లో ఏడుగురు మహిళలు ఉన్నట్లు సమాచారం.
ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. వాహనం అతివేగంతోపాటు.. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో లోపల ఉన్న కూలీలు వాహనం కింద పడి నలిగిపోయారు.
ఈ ఘోర ప్రమాద ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ‘ఎక్స్’ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాను. ధార్‌కు వెళ్లి చికిత్స ఏర్పాట్లు పర్యవేక్షించాలని ఇండోర్ డివిజనల్ కమిషనర్, ఐజీకి సూచనలు ఇచ్చాం. గాయపడిన వారందరికీ ఉచిత చికిత్స అందుతుంది. దేవుడు మృతుల ఆత్మలకు శాంతి కలిగించాలి. బాధలో ఉన్న వారి కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని ట్వీట్ చేశారు.
