దివ్యాంగురాలికి అవమానం: డ్రామాలొద్దు.. లేచి నిలబడు అన్న పోలీస్ ఆఫీసర్

  • Published By: vamsi ,Published On : September 9, 2019 / 03:39 PM IST
దివ్యాంగురాలికి అవమానం: డ్రామాలొద్దు.. లేచి నిలబడు అన్న పోలీస్ ఆఫీసర్

Updated On : September 9, 2019 / 3:39 PM IST

విరాలీ మోడీ దివ్యాంగురాలు. దివ్యాంగుల హక్కుల కోసం పోరాటం చేస్తున్న ధైర్యమైన 28ఏళ్ల యువతి. ఆమె చేసిన పోరాటాలు ఎన్నో.. 2006లో పద్నాలుగేళ్ల వయసులో జ్వరం రాగా ఆమెకు పక్షవాతం అటాక్ అయింది. దాంతో తల నుంచి కిందభాగం వరకు కదలలేని పరిస్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో వీలైచెయిర్‌కే పరిమితమైన ఆమె తనలాంటి ఎంతోమందికి ఇప్పుడు సహాయం చేస్తుంది. దివ్యాంగుల హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టిన ఆమె కేరళలోని ఎర్నాకులమ్ జంక్షన్ ను దివ్యాంగులకు అనుకూలంగా చేయించి పోరాటం గెలిచింది.  2014లో వీల్ చెయిర్ నుంచే మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో పాల్గొని రెండవ స్థానంలో నిలిచింది.

ఇదంతా ఇప్పుడు ఎందుకంటే.. లేటెస్ట్ గా విరాలీ మోడీతో ఢిల్లీ విమానాశ్రయంలోని సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది దారుణంగా ప్రవర్తించారు. వీల్ ఛైర్ లో నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్న విరాలీ మోడీని తనిఖీ చేయడం కోసం లేచి నిలబడమని బలవంతపెట్టారు. తనకు వెన్నెముక పనిచేయదని, లేచి నిలబడలేనని చెప్పినా కూడా.. నాటకాలు చేయొద్దు.. లేచి నిలబడు అంటూ హింసించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు విరాలీ మోడీ. ఈ మేరకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) చీఫ్‌కు ఓ లేఖ రాసిన విరాలీ మోడీ ఆ వివరాలను కూడా ట్విట్టర్ ద్వారా పోలీసులకు తెలిపింది. ఢిల్లీ నుంచి ముంబైకి వెళుతుండగా ఢిల్లీ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగినట్లు విరాలీ వెల్లడించింది.

“నా వైకల్యం కారణంగా నా పర్సనల్ వీల్‌చైర్‌ను కూడా ఎయిర్ పోర్ట్ కి తీసుకుని వెళ్లాను. దానిని నా లగేజ్ కింద చెక్-ఇన్ కౌంటర్‌లో ఇచ్చాను. అయితే విమానం దగ్గరకు తీసుకుని వెళ్లడం కోసం చెకింగ్ పాయింట్ దగ్గర ఒక పోర్టర్‌(కూలీ)ను సహాయం చేయడానికి పెట్టుకున్నాను. అయితే భద్రతా తనిఖీ వద్దకు చేరుకున్న తరువాత ఓ మహిళా సీఐఎస్ఎఫ్(ఆఫీసర్) ఒకరు చాలా దారుణంగా ప్రవర్తించారు”అని ఆమె ట్వీట్‌లో చెప్పుకొచ్చింది.

నేను నిలబడలేక పోర్టర్ ను పెట్టుకున్నట్లు ఆమెకు చాలాసార్లు చెప్పినప్పటికీ, ఆమె నన్ను నిలబెట్టాడానికి బలవంతంగా ప్రయత్నించింది. నిలబడకపోతే తనిఖీ చేయను” అని చెప్పిందంటూ మోడీ తన ఫిర్యాదులో తెలిపారు. వీల్ చైర్ యూజర్ గా నేను అంతర్జాతీయంగా ప్రయాణిస్తున్నట్లు రుజువు చేసి పాస్ పోర్ట్ చూపినప్పటికీ ఆమె వినలేదని, తన సీనియర్ దగ్గరకు వెళ్లి నేను నటిస్తున్నానని, నాటకం చేస్తున్నానని చెప్పిందంటూ” అని మోడీ ఆరోపించారు.  చివరికి ఒక సీనియర్ ఆఫీసర్ వచ్చి మాన్యువల్ గా చెక్ చేసి నన్ను వెళ్లనిచ్చింది” అని ఆమె తన ట్వీట్ లో తెలిపింది.