Donald Trump : మళ్లీ ట్రంప్ దెబ్బ.. బీభత్సంగా పెరగనున్న పెట్రోల్ ధరలు..
Trump Hormuz Cargo Charge India : ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్తతల వేళ ప్రపంచ ఇంధన మార్కెట్‌ను ప్రభావితం చేసే కీలక నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
Donald Trump new decision 20Percentage transit charge on cargo passing through the Strait of Hormuz impact on india oil imports
- డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే కార్గోపై 20శాతం ఛార్జీ?
- పెట్రోల్ ధరలు భారీగా పెరిగే అవకాశం
Trump Hormuz Cargo Charge India : ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్తతల వేళ ప్రపంచ ఇంధన మార్కెట్‌ను ప్రభావితం చేసే కీలక నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే వాణిజ్య నౌకలపై 20శాతం ట్రాన్సిట్ ఛార్జీ విధిస్తామని ప్రకటించడంతో చమురు దిగుమతులపై ఆధారపడిన భారత్ వంటి దేశాల్లో ఆందోళన నెలకొంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే చమురు దిగుమతుల ఖర్చుతో పాటు దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఇరాన్ పై కొత్త చర్యలను ప్రకటించారు. అందులో భాగంగా ఇరాన్ పోర్టుల చుట్టూ అమెరికా నౌకాదళ దిగ్భంధనాన్ని మళ్లీ అమలు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే అన్ని వాణిజ్య కార్గో నౌకలపై 20శాతం ట్రాన్సిట్ ఛార్జీ వసూలు చేస్తామని తెలిపారు.
ట్రంప్ ప్రకటించిన వివరాల ప్రకారం.. హర్మూజ్ జలసంధిలో రవాణా నౌకలకు రక్షణ కల్పించేందుకు ప్రతిఫలంగా 20శాతం ట్రాన్సిట్ ఛార్జీ వసూలు చేయనున్నట్లు తెలిపారు. ఇరాన్‌కు చెందిన నౌకలకు హర్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు అనుమతి ఉందని, ఇతర దేశాల నౌకలు మాత్రం 20శాతం రుసుము చెల్లించి ప్రయాణించాల్సి ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ విధానం మంగళవారం రాత్రి నుంచి అమల్లోకి రానుందని తెలిపారు.
వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హర్మూజ్ జలసంధికి అమెరికా భద్రత కల్పిస్తోందని, అందుకే దానికి తగిన ప్రతిఫలం పొందాల్సిన హక్కు అమెరికాకు ఉందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఇరాన్‌తో దౌత్యపరమైన చర్యలకు ఇంకా అవకాశం ఉందని ట్రంప్ చెప్పారు.
ట్రంప్ తాజా ప్రకటనలో హర్మూజ్ జలసంధి నుంచి చమురును సరఫరా చేసే దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా భారతదేశం దిగుమతి చేసుకునే చమురులో 40శాతం హర్మూజ్ జలసంధి గుండానే వస్తుంది. ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్ వంటి గల్ప్ దేశాల నుంచి చమురు, ఎల్ఎన్జీ సరఫరాలు ఎక్కువగా హర్మూజ్ మార్గంలోనే జరుగుతున్నాయి. ట్రంప్ తాజా నిర్ణయం అమల్లోకి వస్తే భారత చమురు రిఫైనరీలు, షిప్పింగ్ కంపెనీలు, బీమా సంస్థలపై అదనపు భారం పడే అవకాశం ఉంది. రవాణా వ్యయం పెరగడంతో చివరికి పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ వంటి ఇంధనాల ధరలపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
భారత్ 2022 నుంచి రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురు కొనుగోళ్లు పెంచినప్పటికీ, గల్ఫ్ దేశాలపై ఆధారపడటం ఇంకా ఎక్కువగానే ఉండటంతో హర్మూజ్ జలసంధి నుంచి చమురు రవాణాకు ఎలాంటి అంతరాయం ఏర్పడినా దేశంలో ఇంధన ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ట్రంప్ ప్రతిపాదన అమల్లోకి వస్తే.. పూర్తిస్థాయిలో లోడ్ చేసిన ప్రతి చమురు సూపర్ ట్యాంకర్ నుంచి అమెరికా 30 మిలియన్ డాలర్లు (రూ.287 కోట్లు) వసూళ్లు చేసే అవకాశం ఉంటుంది. బ్లూమ్‌బెర్గ్ కథనం ప్రకారం.. ప్రస్తుతం బ్యారెల్‌కు సుమారు 80 డాలర్లుగా చమురు ధరను లెక్కేసుకొన్నా.. వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్ (వీఎల్సీసీ)లో 20లక్షల బ్యారెళ్ల చమురు పడుతుంది. అప్పుడు దీని మొత్తం విలువ 160 మిలియన్ డాలర్లుగా ఉంటుంది. దీనిలో 20శాతం అమెరికా టోల్గా లెక్కేసుకొంటే.. ఒక్కో నౌకపై 30-32 మిలియన్ డాలర్లు ట్రంప్ ట్యాక్స్ పడుతుందని అంచనా.
యూఏఈ ట్యాంకర్లపై దాడి.. భారతీయుడు మృతి..
ట్రంప్ ప్రకటనకు ముందు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కీలక ఆరోపణలు చేసింది. హోర్ముజ్ జలసంధి దక్షిణ ప్రాంతంలో ప్రయాణిస్తున్న ‘మొంబాసా’, ‘అల్ బహియాహ్’ అనే రెండు చమురు ట్యాంకర్లపై ఇరాన్ క్రూయిజ్ క్షిపణులతో దాడి చేసిందని పేర్కొంది. ఈ ఘటనలో ఒక భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోగా.. మరో ఎనిమిదికి గాయాలయ్యాయి. వీరిలో ఆరుగురు భారతీయులు, ఇద్దరు యుక్రెయిన్ పౌరులు ఉన్నట్లు యూఏఈ వెల్లడించింది. ఈ దాడిని అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ఖండించిన యూఏఈ, తగిన చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని స్పష్టం చేసింది.
ఇదిలాఉంటే.. యూఏఈ ట్యాంకర్లపై దాడి ఘటనపై గానీ, ట్రంప్ ప్రకటించిన 20శాతం ట్రాన్సిట్ ఛార్జీపై గానీ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయితే గల్ఫ్ ప్రాంతంలో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ నావికులు, అలాగే దేశ ఇంధన అవసరాల దృష్ట్యా ఈ పరిణామాలను కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు.. ట్రంప్ ప్రతిపాదనపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందించారు. మేము కచ్చితంగా వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించి.. సురక్షితంగా జలసంధిని దాటించగలమని అన్నారు. ఈ సేవలకు సొమ్ము తీసుకుంటాము. అమెరికా ప్రతిపాదించిన 20శాతం చాలా ఎక్కువ. మేము సముచితంగా ఛార్జి వసూలు చేస్తామని చెప్పుకొచ్చారు.
