PM Modi House: ప్రధాని మోదీ నివాసం మీదుగా డ్రోన్.. దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీసులు

ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసంపై డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. సోమవారం తెల్లవారు జామున 5గంటల సమయంలో ప్రధాని నివాసంపై డ్రోన్ ఎగురుతున్నట్లు గుర్తించారు.

PM Modi House: ప్రధాని మోదీ నివాసం మీదుగా డ్రోన్.. దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీసులు

PM Modi residence

Updated On : July 3, 2023 / 9:53 AM IST

PM Narendra Modi: ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendar Modi) నివాసంపై డ్రోన్ (Drone) ఎగరడం కలకలం రేపింది. సోమవారం తెల్లవారు జామున 5గంటల సమయంలో ప్రధాని నివాసం (PM residence) పై డ్రోన్ ఎగురుతున్నట్లు గుర్తించారు. ఈ విషయంపై ఎస్పీజీ (SPG) సిబ్బంది ఢిల్లీ పోలీసు (Delhi Police) లకు సమాచారం అందించడంతో.. పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటీన ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ఢిల్లీ పోలీసులు, భద్రతా సిబ్బంది డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎటు వెళ్లింది అనే విషయాలపై వెతుకులాట ప్రారంభించారు. అయితే, పోలీసులకు డ్రోన్ గురించి ఎలాంటి సమాచారం లభించలేదు.

డ్రోన్ ఎవరిది, ప్రధాని నివాస ప్రాంతానికి ఎలా వచ్చింది అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రధాని మోదీ నివాసం, పరిసర ప్రాంతాల్లో నో ఫ్లయింగ్ జోన్ అమల్లో ఉంది. ఈ ప్రాంతంలో పటిష్ఠ భద్రత ఉంటుంది. అయినా, ఆ ప్రాంతంలో డ్రో‌న్ ఎగరడం కలకలం రేపుతోంది.  ప్రధాని అధికారిక నివాస భవనం దేశ రాజధాని ఢిల్లీలోని లుటియన్స్ జోన్‌లోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఉంది.  2014 నుంచి ప్రధాని మోదీ అక్కడే నివాసం ఉంటున్నారు. పన్నెండు ఎకరాల విస్తీర్ణంలో ప్రధాని నివాసం ఉంటుంది. 1980లో ఈ భవనాన్ని నిర్మించారు.

ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి సమీపంలో గుర్తు తెలియని ఎగిరే వస్తువు గుర్తించినట్లు ఎన్‌డీడీ కంట్రోల్ రూంకు సమాచారం అందింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించటం జరిగింది. డ్రోన్ ఎగిరినట్లు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ (ఎటీసీ) కూడా స్పందించటం జరిగింది. వారికి కూడా ప్రధాని నివాసానికి సమీపంలో డ్రోన్ ఎగిరినట్లు కనిపించలేదు. ప్రస్తుతానికి దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.