Drunk school teacher
Drunk school teacher : పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన గురువు మందుకొట్టి తరగతి గదిలోనే నిద్రపోయిన ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలోని ఓ పాఠశాలలో పీకల దాకా మద్యం తాగిన పాఠశాల ఉపాధ్యాయుడు తరగతి గదిలోనే అపస్మారక స్థితిలో పడి పోయాడు. ఉపాధ్యాయుడు తరగతి గదిలోని కుర్చీపై అపస్మారక స్థితిలో పడి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మందుబాబు అయిన టీచర్ నిద్రపోతుండటంతో విద్యార్థులు విస్తుపోయి ప్రధానోపాధ్యాయుడికి, తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడు మత్తులో ఉన్నట్టు సమాచారం అందుకున్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని నిద్ర లేపేందుకు ప్రయత్నించారు. కానీ టీచర్ బాగా తాగి కుర్చీలోంచి లేవలేకపోయాడు. ఈ సమయంలో టీచర్ పరిస్థితిని చిత్రీకరించిన స్థానికులు సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేశారు.
ఉపాధ్యాయుడు అపస్మారక స్థితి నుంచి మేల్కొన్న తర్వాతే స్థానికులు అక్కడి నుంచి వెళ్లిపోతున్నట్లు వీడియోలో ఉంది. టీచర్ మద్యం మత్తులో పాఠశాలకు రావడం ఇదే మొదటిసారి కాదు. ఈ మందుబాబు అయిన ఉపాధ్యాయుడికి పలుసార్లు హెచ్చరికలు చేసినప్పటికీ, అతను తన ప్రవర్తనను మార్చుకోలేదు.
Also Read : BAN vs SL : శ్రీలంక పై బంగ్లాదేశ్ విజయం..
దీంతో స్థానికులు వీడియో ద్వారా మందుబాబు నిర్వాకాన్ని బహిర్గతం చేశారు. ఈ ఘటనపై జిల్లా ప్రాథమిక విద్యాశాఖ అధికారి అలోక్ సింగ్ మాట్లాడుతూ మందుబాబు టీచర్ విషయమై విచారణ చేపట్టామని, ఉపాధ్యాయుడిని దోషిగా నిర్ధారించి సస్పెండ్ చేశామని తెలిపారు.