ED Raids : కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ నివాసంలో ఈడీ సోదాలు.. రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రాంతాల్లో..
ED Raids : కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది.
Kerala EX CM Pinarayi Vijayan
ED Raids : కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా పది ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. వాటిలో తిరువనంతపురంలోని మాజీ సీఎం నివాసం కూడా ఉంది. ఆయన అల్లుడు, మాజీ మంత్రి పీ.ఏ. మొహమ్మద్ రియాస్ ఇంట్లో కూడా తనిఖీలు జరిగాయి.
కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ (CMRL) కు సంబంధించిన మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో పినరయి విజయన్ కుమార్తె టీ. వీణకు చెందిన ఎక్స్‌లాజిక్ సొల్యూషన్స్ కంపెనీకి CMRL సంస్థ అక్రమ చెల్లింపులు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలను ఈడీ అధికారులు పరిశీలించినట్లు తెలిసింది.
పినరయి విజయన్ కుమార్తె టి. వీణకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ అనే కంపెనీకి సిఎంఆర్ఎల్ రూ.1.72 కోట్లు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2018 నుండి 2019 వరకు ఎలాంటి సేవలు అందించనప్పటికీ, సీఎంఆర్ఎల్ ఎక్సాలాజిక్ సొల్యూషన్స్‌కు రూ. 1.72 కోట్లు అక్రమంగా చెల్లించిందని ఆరోపణలు వచ్చాయి. 2023 ఆగస్టులో ఆ అంశం వెలుగులోకి వచ్చింది. ఆ నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని ఎస్‌ఎఫ్‌ఐఓకు గతంలోనే కేంద్రం నుంచి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విషయంలో వీణపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా తాజాగా ఈ తనిఖీలు జరిగాయి.
కేరళ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించిన ఒకరోజు తరువాత ఈడీ దాడులు జరిగాయి. ఈడీ దర్యాప్తును రద్దు చేయాలని కోరుతూ సీఎంఆర్ఎల్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. దీంతో బుధవారం ఉదయం ఈడీ సోదాలు ప్రారంభించింది. ఇదిలాఉంటే.. ఈడీ సోదాలపై సీపీఐ(ఎం) పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు.
