డ్రాగన్ బరితెగింపు.. భారత పౌరులను ఎత్తుకెళ్లిన చైనా ఆర్మీ..!

  • Published By: sreehari ,Published On : September 5, 2020 / 03:05 PM IST
డ్రాగన్ బరితెగింపు.. భారత పౌరులను ఎత్తుకెళ్లిన చైనా ఆర్మీ..!

Updated On : September 5, 2020 / 4:17 PM IST

భారత్, చైనా సరిహద్దులో ఉద్రిక్తల నేపథ్యంలో చైనా మిలటరీ ఐదుగురు భారత పౌరులను కిడ్నాప్ చేసినట్టు వార్తలు వచ్చాయి. సుబన్‌సిరి జిల్లాలోని అడవిలో వేటకు వెళ్లిన భారత పౌరులను చైనా ఆర్మీ కిడ్నాప్ చేసేందనే వార్తలపై అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. సుబన్ సిరి జిల్లాలోని నాచో ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన జరిగిందని కిడ్నాప్‌కు గురైన వారి కుటుంబాలు ఆరోపించాయి.



చైనా మిలటరీ భారత పౌరులను కిడ్నాప్ చేసే సమయంలో మరో ఇద్దరు తప్పించుకున్నారు.. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు నివేదిక తెలిపింది. చైనా ఆర్మీ భారత పౌరులను అపహరించిందనే వార్తల్లో ఎంత వాస్తవం ఉందో ధృవీకరించేందుకు నాచ పోలీసు స్టేషన్ అధికారిని ఆ ప్రాంతానికి పంపించారు. దీనిపై తమకు వెంటనే రిపోర్టు చేయాలని చెప్పానని సీనియర్ అధికారి తెలిపారు. ఆదివారం ఉదయం నాటికి మాత్రమే ఈ నివేదిక అందుబాటులో ఉంటుందని పోలీసు సూపరింటెండెంట్ తరు‌త్ గుస్సార్ తెలిపారు.



చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) సుబాసిరి జిల్లా నుంచి ఐదుగురిని అపహరించినట్లు కాంగ్రెస్ నేత Ninong Ering శనివారం ఉదయం ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.. ‘షాకింగ్ న్యూస్.. అరుణాచల్ ప్రదేశ్‌లోని సుబన్సిరి జిల్లాకు చెందిన ఐదుగురిని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) అపహరించినట్లు తెలిసింది’అంటూ ఆయన ట్వీట్ చేశారు.


చైనాకు, దాని ఆర్మీకి ‘తగిన సమాధానం’ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనే కొన్ని నెలల క్రితం తమ రాష్ట్రంలో జరిగిందని చెప్పారు. కిడ్నాప్ అయిన వారిలో Toch Singkam, Prasat Ringling, Dongtu Ebiya, Tanu Baker, Ngaru Diri ఉన్నట్టుగా గుర్తించారు. వీరంతా టాగిన్ వర్గానికి చెందినవారు. డపోరిజోలో నివసిస్తున్న వారి కుటుంబ సభ్యులు భారత బంధువులను కలిసేందుకు నాచోకు బయలుదేరారు.



కిడ్నాప్ అయిన భారత పౌరులను తిరిగి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు అధికారులను కోరారు. ఈ ఘటనపై చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తగిన సమాధానం ఇవ్వాలని ఎమ్మెల్యే ఎరింగ్ డిమాండ్ చేశారు. మార్చిలో 21 ఏళ్ల వ్యక్తిని మెక్ మహోన్ లైన్ సమీపంలో అసపిలా సెక్టార్ నుంచి చైనా ఆర్మీ అపహరించింది. అప్పుడు వారిలో ఇద్దరు స్నేహితులు తప్పించుకున్నారు. 19 రోజుల తమ చెరలో బందీగా ఉంచిన చైనా ఆర్మీ వారిని విడుదల చేసింది.