ఆ ఎంపీలు క్షమాపణ చెబితే సస్పెన్షన్ ఎత్తివేస్తాం… రవి శంకర్ ప్రసాద్

వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా రాజ్యసభలో సస్పెన్షన్ కు గురైన ఎనిమిది మంది సభ్యులు క్షమాపణ కోరితే వారిపై .వారిపై గల సస్పెన్షన్ ను ఎత్తివేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు. ఎనిమిది మంది సభ్యులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరుతూ కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు రాజ్యసభ నుంచి మంగళవారం వాకౌట్ చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశారు.
సభలో విపక్ష సభ్యులు అలా దురుసుగా వ్యవహరించడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని తాము ఆశించామని, కానీ అలా జరగలేదని రవి శంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చిన ట్వీట్ కు అనుగుణంగా ఎంపీలు ఇలా ప్రవర్తించడం ఏ తరహా రాజకీయమని ఆయన రాహుల్ ట్వీట్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. తన తల్లి సోనియా గాంధీ వైద్య పరీక్షలకు విదేశాలకు వెళ్లగా ఆమెకు సాయంగా ఉండేందుకు రాహుల్ గాంధీ కూడా వెళ్లిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ ఎంపీ ఒకరు రాజ్యసభలో టేబుల్ పై నిలబడి డ్యాన్స్ చేస్తూ పత్రాలు చించివేయడాన్ని తాము ఎన్నడూ చూడలేదని రవి శంకర్ ప్రసాద్ అన్నారు. బిల్లులు సభ ఆమోదం పొందేలా చూసేందుకు ప్రభుత్వానికి రాజ్యసభలో పూర్తి మెజారిటీ ఉందని ఆయన చెప్పారు. కాగా, వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా ఆదివారం రాజ్యసభలో విపక్షాలు ఆందోళనకు దిగడంతో తీవ్ర గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. ఏ నేపథ్యంలో సభలో దురుసుగా వ్యవహరించారన్న కారణంతో 8మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది.