Farmer Laws : రైతు చట్టాల రద్దుకు పార్లమెంట్ ఆమోదం
రైతు చట్టాల రద్దుకు రాజ్యసభ ఆమోదం లభించింది. రాజ్యసభలో ఎటువంటి చర్చ లేకుండానే మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది

Farmer Laws
Farmer Laws : గతేడాది కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాల రద్దుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. సోమవారం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాగానే ఉభయ సభల్లో ఎటువంటి చర్చ లేకుండానే చట్టాల రద్దు ఆమోదం పొందింది. ఈ రాత్రికి రాష్ట్రపతి సంతకం చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
మొదట లోక్ సభలో చట్టాల రద్దు బిల్లు ప్రవేశపెట్టగా దీనిపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అయితే ఇందుకు స్పీకర్ ఒప్పుకోలేదు.. రద్దు చేసే చట్టాలపై చర్చ దేనికని అభిప్రాయపడ్డారు స్పీకర్. అనంతరం సభ వీటిని రద్దు చేస్తూ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే రాజ్యసభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభలో కూడా ఎటువంటి చర్చ లేకుండానే చట్టాల రద్దు పూర్తైంది. ఇక ఈ రోజు సాయంత్రం దీనిపై రాష్ట్రపతి సంతకం చేసే అవకాశం ఉంది. రాష్ట్రపతి సంతకంతో చట్టాల రద్దు ప్రక్రియ పూర్తవుతుంది.
కాగా గతేడాది కేంద్ర ప్రభుత్వం మూడు రైతు చట్టాలను తీసుకురాగా దీనిని దేశవ్యాప్తంగా రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇవి కార్పొరేట్లకు ఊతమిచ్చేలా ఉన్నాయని ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శలు గుప్పించాయి. మరోవైపు రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదికి పైగా ఉద్యమం చేశారు రైతులు. రైతు ఉద్యమాలకు దిగొచ్చిన ప్రభుత్వం తాజాగా రైతు చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు శీతాకాల సమావేశాల తొలిరోజే తమ ప్రకటనపై నిర్ణయం తీసుకుంది. చట్టాలను రద్దు చేస్తూ ఉభయసభలు ఆమోదం తెలిపాయి.