ఢిల్లీ సరిహద్దుల్లో 17వ రోజు రైతుల ఆందోళన..టోల్ ఫీజు వసూలు చేయకుండా అడ్డుకుంటున్న అన్నదాతలు

  • Published By: bheemraj ,Published On : December 12, 2020 / 03:47 PM IST
ఢిల్లీ సరిహద్దుల్లో 17వ రోజు రైతుల ఆందోళన..టోల్ ఫీజు వసూలు చేయకుండా అడ్డుకుంటున్న అన్నదాతలు

Updated On : December 12, 2020 / 3:54 PM IST

Farmers’ agitation borders of Delhi : ఢిల్లీ సరిహద్దుల్లో 17 వ రోజు రైతుల ఆందోళన కొనసాగుతోంది. నిరసన కార్యక్రమాల్లో భాగంగా టోల్ గేట్ల దగ్గర టోల్ ఫీజు వసూలు చేయకుండా రైతులు అడ్డకుంటున్నారు. దీంతో పలు టోల్ గేట్ల దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం 9 గంటల వరకు ప్రశాంతంగా సాగిన రైతుల ఆదోళన తర్వాత ఉద్రిక్తతకు దారి తీసింది. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొన్ని టోల్ ప్లాజాలు మూసివేసేందుకు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

ఢిల్లీ, యూపీ సరిహద్దుల్లోని టోల్ ప్లాజాల వద్దకు రైతులు భారీగా తరలివచ్చారు. దీంతో ఢిల్లీ-యూపీ, ఢిల్లీ-హర్యానా వద్ద భారీగా బలగాలను మోహరించారు. అంతకముందు ఇవాళ ఉదయం వరకు టోల్ ప్లాజా నిర్వహకులు అన్నదాతలకు సహకరించారు. ఢిల్లీ, హర్యానా సరిహద్దుల్లోని పలు టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి ఫీజు వసూలు చేయకుండా వాహనాల రాకపోకలకు అనుమతిచ్చారు. పలు టోల్ ప్లాజాలను రైతులు మూసివేశారు. దీంతో 12 గంటలకు టోల్ ప్లాజామూసివేశారని ఈ అర్ధరాత్రి 12 గంటల వరకు మూసే ఉంటుందని నిర్వహకులు తెలిపారు. ఆగ్రాలోని ఐదు టోల్ ప్లాజాల దగ్గర వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగలేదు.

ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల కనిష్ట స్థాయికి పడిపోయాయి. అయినప్పటికీ గడ్డ కట్టించే చలిని కూడా లెక్కచేయకుండా రైతులు ఆందోళన కొనసాగించారు. వ్యవసాయ చట్టాలు ఉపసంహరించే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు. రైతులు ఆందోళన కార్యక్రమాలను రోజు రోజుకు ఉధృతం చేస్తున్నారు. మహిళా రైతులు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ఈ నెల 14న ఉత్తర భారతదేశంలోని రైతులంతా ఢిల్లీని ముట్టడించాలని నిర్ణయించారు. అదే సమయంలో దక్షిణ భారతదేశంలోని రైతులు జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అటు రైతుల ఆందోళన దృష్ట్యా సెంట్రల్ ఢిల్లీలోని బీజేపీ నేతల నివాసాల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. అటు ఆందోళనలో పాల్గొనేందుకు హర్యానా నుంచి ట్రాక్టర్లలో రైతులు ఢిల్లీ చేరుకుంటున్నారు.

700 ట్రక్కుల్లో రైతులు ఢిల్లీ కుండలి సరిహద్దులకు వచ్చారు. పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్‌ ప్రదేశ్ రాష్ట్రాల నుంచి రైతులు భారీగా తరలివస్తున్నారు. దీంతో సింఘు, టిక్రి, జారోదా, ఘాజీపూర్, చల్లా, నోయిడా లింక్ రోడ్డు, జటిక్రా సరిహద్దు రహదారులు మూసివేశారు. హర్యానా, నోయిడా నుంచి ఢిల్లీ వచ్చే వాహనాలను దారి మళ్లించారు. సరిహద్దుల్లోనూ, రైతులు బస చేస్తున్న బురారీలోని నిరంకారీ మైదానం దగ్గరా…భారీగా కేంద్ర బలగాలను మోహరించారు.