ఢిల్లీలో రైతుల ఆందోళన, ట్రాక్టర్ ర్యాలీ రిహార్సల్స్

Farmers gear up for R-Day showdown : నూతనంగా తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలను మరింత ఉధృతం చేస్తున్నారు.. రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీకి ఈ రోజు రిహార్సల్ నిర్వహించనున్నారు. 2021, జనవరి 07వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు ఈ ట్రాక్టర్ ర్యాలీ ప్రారంభం కానుంది.. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన నిర్వహిస్తున్న నాలుగు ప్రాంతాల నుంచి ఈ ట్రాక్టర్ ర్యాలీ ప్రారంభం కానుంది.
సింఘు నుంచి టిక్రి, టిక్రి నుంచి షాజహనపూర్, ఘాజిపూర్ నుంచి పల్వాల్, పల్వాల్ నుంచి ఘాజిపూర్ వరకు ర్యాలీలు నిర్వహించేందుకు రైతు సంఘాలు ప్రణాళికలు వేసుకున్నారు.. ఇతర రైతు సంఘాలతో కేంద్రం చర్చలు జరపడం, సవరణలతో సరిపెడతామనడం సరికాదని.. కేంద్రానికి సమస్య పరిష్కారంపై శ్రద్ధ లేదని అర్థమవుతుందంటున్నాయి రైతు సంఘాలు.. దీంతో దేశవ్యాప్తంగా తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామంటున్నారు రైతులు..
కేంద్రం ఈ నెల 8న రైతు సంఘాలతో మరోసారి చర్చలు జరపనుంది.. ఈ చర్చల్లో కూడా సయోధ్య కుదరకపోతే.. తమ ఆందోళనలను మరింత ఉధృతం చేయడానికి తగిన ప్రణాళికలను, అందుకనుగుణంగా ఏర్పాట్లను చేసుకుంటున్నారు.. 13, 14 తేదీల్లో లోహ్రి, మకర సంక్రాంతి సందర్భంగా సాగు చట్టాల ప్రతులను దహనం చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.. 18న మహిళా కిసాన్ దివస్ పేరిట ఆందోళనలు, 23న నేతాజీ జయంతి సందర్భంగా ఆజాద్ కిసాన్ ఆందోళనలు, 26న ఢిల్లీలో ట్రాక్టర్లతో గణతంత్ర పరేడ్ నిర్వహిస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి.