Kota: కొడుకుని కలిసి సొంతూరికి తిరిగి వెళుతుండగానే.. విషాద వార్త..
కుమారుడిని పలకరించి సొంతూరికి వెనుతిరిగిన ఆ తండ్రికి మార్గ మధ్యలోనే విషాద వార్త అందింది. కన్నకొడుకు ఇక లేడనే వార్త తెలియడంతో అతడు హుటాహుటిన...

Kota student: ఐఐటీ, జేఈఈ కోచింగ్ సెంటర్లకు (IIT JEE Coaching) కేంద్రంగా మారిన రాజస్థాన్ (Rajasthan) లోని కోటా పట్టణంలో విద్యార్థుల బలవన్మరణాలు ఆగడం లేదు. తల్లిదండ్రుల ఆకాంక్షల బరువు మోయలేక, చదువుల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు బలైపోతున్నారు. తాజాగా మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వారం వ్యవధిలో ఇది మూడోది కావడం ఆందోళన రేపుతోంది. విద్యార్థుల వరుస బలవన్మరణాలతో తల్లిదండ్రులు భయపడిపోతున్నారు.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని అజంగఢ్ (Azamgarh) నగరానికి చెందిన మనీశ్ ప్రజాపతి అనే 17 ఏళ్ల విద్యార్థి హాస్టల్ గదిలోని ఫ్యాన్ కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కోచింగ్ తీసుకోవడానికి 4 నెలల క్రితమే కోటా పట్టణానికి వచ్చిన మనీశ్.. స్థానిక మహావీర్ నగర్ హాస్టల్ లో ఉంటున్నాడు. గురువారం తండ్రి వచ్చి అతడిని కలిశాడు. ఆయన సొంతూరికి తిరిగి వెళుతుండగానే కుమారుడి వార్త తెలిసింది.
ఇంటికి తిరిగివెళుతున్న మనీశ్ తండ్రి రాత్రి 8 గంటల సమయంలో తన కుమారుడికి ఫోన్ చేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో హాస్టల్ నంబర్‌కు కాల్ చేశాడు. ఐదో అంతస్తులోని మనీశ్ గదికి వెళ్లి తలుపు తట్టానని, అయితే సమాధానం రాలేదని కేర్‌టేకర్ రాకేశ్ తెలిపారు. ఆ తర్వాత కిటికీలోంచి చూసేసరికి బెడ్‌షీట్‌తో మనీశ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. దీంతో కేర్‌టేకర్ రాకేశ్ వెంటనే జవహర్ నగర్ పోలీసులకు సమాచారం అందించారు.
సూసైడ్ నోట్ దొరకలేదు: పోలీసులు
“అజంగఢ్‌కు ఇంటికి వెళ్లే మార్గంలో ఉన్న మనీశ్ తండ్రికి సమాచారం అందించడంతో ఆయన వెనక్కి తిరిగి వస్తున్నారు. కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు పంపిస్తాం. మనీశ్ బలవన్మరణానికి పాల్పడినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటివరకు సూసైడ్ నోట్ దొరకలేదు” అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మనీశ్ చదువుల్లో వెనకబడినట్టు గుర్తించామని చెప్పారు.
భార్గవ్ మిశ్రా అనే 17 ఏళ్ల యువకుడు ఆగస్టు 4న తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బిహార్‌లోని చంపారన్ ప్రాంతానికి చెందిన భార్గవ్.. ఇంజినీరింగ్ కోచింగ్ కోసం ఇక్కడికి వచ్చాడు. అంతకుముందు రోజు మంజోత్ చాబ్రా అనే 17 ఏళ్ల విద్యార్థి ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అయితే అతడి తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడిని హత్య చేశారని ఆరోపించారు. దీంతో హాస్టల్ యజమానితో పాటు ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ ప్రాంతానికి చెందిన మంజోత్.. మెడికల్ కోచింగ్ కోసం కోటాకు వచ్చాడు.
10 వేల మంది బలవన్మరణం..
ఐఐటీ, జేఈఈ కోచింగ్ సెంటర్ల హబ్ గా మారిన కోటా పట్టణంలో గతేడాది 15 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. 2021లో 9 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కాగా, దేశవ్యాప్తంగా 18 ఏళ్లలోపు 10 వేల మంది విద్యార్థులు 2021లో ఆత్మహత్యల కారణంగా మరణించారని బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ (Sushil Kumar Modi) బుధవారం రాజ్యసభకు తెలిపారు. ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్ వంటి ప్రముఖ విద్యాసంస్థలకు చెందిన 75 మంది విద్యార్థులు గత ఐదేళ్లలో తమ జీవితాలను ముగించుకున్నారని ఆయన వెల్లడించారు.