Manish Sisodia : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీశ్ సిసోడియాకు బిగ్ రిలీఫ్..

ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు బిగ్ రిలీఫ్ లభించింది.

Manish Sisodia

Misnish sisodiya : ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు బిగ్ రిలీఫ్ లభించింది. సుప్రీంకోర్టు జస్టిస్ బీఆర్ గవావ్ ధర్మాసనం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తుది తీర్పు ఇచ్చింది. నిబంధనలతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతీ సోమవారం దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావాలని సిసోడియాను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో గతేడాది ఫిబ్రవరి 26న, ఈడీ కేసులో గతేడాది మార్చి 9న సిసోడియాను దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశాయి. దీంతో 17నెలలుగా ఆయన జైలు జీవితం గడుపుతున్నారు.

Also Read : Delhi Liquor Policy Case : లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో తీహార్ జైలుకు కేజ్రీవాల్.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ!

సుప్రీంకోర్టు తాజా తీర్పుతో 17నెలల తరువాత మనీశ్ సిసోడియా జైలు నుంచి బయటకు రానున్నారు. విచారణ ఆలస్యం కావడానికి సిసోడియాకూడా కారణమన్న ట్రయల్ కోర్టు తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు చేసిన ప్రతికూల వ్యాఖ్యలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బెయిల్‌ను శిక్షగా తిరస్కరించలేమని చెప్పింది. బెయిల్ అనేది నియమం, జైలు మినహాయింపు అని ట్రయల్ కోర్టులు, హైకోర్టులు గ్రహించాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు పేర్కొంది.

విచారణను గడువులోగా పూర్తిచేసే అవకాశం లేదు. విచారణను పూర్తి చేయడంకోసం సిసోడియాను జైల్లో ఉంచడం ఆర్టికల్ 21 ఉల్లంఘన తప్ప మరొకటి కాదని సుప్రింకోర్టు పేర్కొంది. సిసోడియాకు సమాజంలో పలుకుబడి ఉంది. అతను పారిపోలేడు. సాక్ష్యాన్ని తారుమారు చేయడం గురించి, కేసు ఎక్కువగా డాక్యుమెంటేషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు.. ట్యాంపరింగ్‌కు అవకాశం లేదని ధర్మాసనం పేర్కొంది.

Also Read : Delhi Liquor Policy Case : ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కీలక పరిణామం

కేంద్ర ప్రభుత్వ నియంతృత్వానికి చెంపపెట్టు : ఆప్ ఎంపీ
మనీశ్ సిసోడియాకు బెయిల్ మంజూరు కావడంపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ స్పందించారు. ఇది సత్య విజయం. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వానికి చెంపపెట్టు. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఈ కేసులో ఆధారాలు లేవు. మా నాయకులను బలవంతంగా జైల్లో పెట్టారు. మనీశ్ సిసోడియాను 17నెలలు జైలులోనే ఉంచారు. మాకు న్యాయం చేసినందుకు, ఆప్ కు అనుకూలంగా తీర్పు వచ్చినందుకు నేను సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ కూడా త్వరలో జైలు నుండి బయటకు రావాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను అని సంజయ్ సింగ్ పేర్కొన్నారు.