Shibu Soren: ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూసోరెన్ కన్నుమూత

ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూసోరెన్ సోమవారం ఉదయం కన్నుమూశారు. ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో కిడ్నీ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ ..

Shibu Soren: ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూసోరెన్ కన్నుమూత

Shibu Soren

Updated On : August 4, 2025 / 10:46 AM IST

Shibu Soren: ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) వ్యవస్థాపకులు శిబూ సోరెన్ (81) సోమవారం ఉదయం కన్నుమూశారు. ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో కిడ్నీ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. జూన్ చివరి వారంలో కిడ్నీ సంబంధిత సమస్యతో శిబు సోరెన్ ఆసుపత్రిలో చేరారు. గురూజీ అని ముద్దుగా పిలువబడే సోరెన్.. ప్రత్యేక ఝార్ఖండ్ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. గిరిజన, అణగారిని వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు.

ప్రస్తుత ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆయన కుమారుడు. తన తండ్రి మరణాన్ని ధృవీకరిస్తూ హేమంత్ సోరెన్ ట్వీట్ చేశారు. “ప్రియమైన దిశోం గురూజీ మనల్ని విడిచిపెట్టారు. ఈ రోజు నేను ప్రతిదీ కోల్పోయాను” అని ఆయన పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆస్పత్రికి వెళ్లి శిబు సోరెన్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు.

శిబు సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) వ్యవస్థాపకుడు మరియు ప్రముఖ నాయకుడు. ఆయనను దిషోం గురు అని కూడా పిలుస్తారు. శిబు సోరెన్ 1944 జనవరి 11న జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా (గత బీహార్‌లోని హజారీబాగ్ జిల్లా) నెమ్రా గ్రామంలో జన్మించారు. ఆయన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి. ఆయన మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే, తన ముఖ్యమంత్రి పదవులో ఎప్పుడూ పూర్తిస్థాయి పదవీకాలం కొనసాగలేదు.

నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో శిబు సోరెన్ ఎనిమిది సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. రెండు సార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. ఆయన తొలిసారిగా 1980లో దుమ్కా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2004లో ఎంపీగా గెలిచిన తరువాత హన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగానూ పనిచేశారు.